● కొండపై తవ్విన సొరంగాలు పూడ్చివేత
● కొండ చుట్టూ పటిష్ట నిఘా ఏర్పాటు
● ‘‘రంగురాళ్లకు పచ్చవల’’
అనే ‘సాక్షి’ కథనానికి స్పందన
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శంకరపురం సమీపంలోని అటవీ భూములను అటవీ శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు. శంకరపురం కొండలో సొరంగాలు తవ్వి రంగురాళ్ల అక్రమ తరలింపుపై ‘సాక్షి’ దినపత్రిక ఈ నెల 9వ తేదీన ‘‘రంగురాళ్లకు పచ్చవల’’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనానికి అటవీశాఖ క్షేత్రస్థాయి అధికారి ఏవీ నీలకంఠేశ్వరరెడ్డి, డెప్యూటీ రేంజ్ అధికారి డి.రామ్మోహన్‌రావు శంకరపురం కొండపైకి వెళ్లి రంగురాళ్ల కోసం తవ్విన సొరంగాలు పరిశీలన చేశారు. అటవీశాఖ సిబ్బందితో కలిసి కొండపై మొత్తం తిరిగి సొరంగాలు గుర్తించారు. రంగురాళ్ల కోసం తవ్విన సొరంగాలను యుద్ధప్రాతిపదికన పొక్లెయిన్‌తో పూడ్చి వేయించారు. సొరంగాలు ఆనవాలు కన్పించకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం శంకరపురం, భట్రుపాలెం, కాట్రపాడు, మాదినపాడు గ్రామాల ప్రజలతో మాట్లాడారు. శంకరపురం కొండపైకి వెళితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అటవీశాఖ క్షేత్రస్థాయి అధికారి నీలకంఠేశ్వరరెడ్డి మాట్లాడుతూ శంకరపురం కొండపై అక్రమంగా తవ్వకాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొండ చుట్టూ ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తామని, కొండపైకి రాకపోకలు సాగించేవారిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తామన్నారు. శంకరపురం కొండపై తవ్వకాలు జరుపుతున్నట్లు తెలిస్తే ప్రజలు తమకు సమాచారం అందించాలని, తవ్వకాలు జరిపిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటవీశాఖ సిబ్బంది నిరంతరం కొండ చుట్టూ పర్యవేక్షణ చేస్తారని, ఎక్కడికక్కడే చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి కొండపైకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పరిశీలనలో బీట్ అధికారి షేక్ జానీబాషా తదితరులు పాల్గొన్నారు.


