పురుగుమందు డబ్బాతో ఓ రైతు ఆవేదన
మాచర్ల: తనకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమని, దీనికి మాచర్ల అధికారులే కారణం అవుతారంటూ మాచర్ల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు శ్రీహరి మాట్లాడుతూ తన పొలంలో గ్రామానికి చెందిన మద్దిగపు శ్రీనివాసరెడ్డి, చిన్న వెంకట్రామిరెడ్డి అక్రమంగా బోర్లు వేశారని ఆరోపించారు. పల్నాడు జాయింట్ కలెక్టర్, గురజాల ఆర్డీవో మురళి, మాచర్ల తహసీల్దార్ కిరణ్‌కుమార్, మాచర్ల రూరల్ సీఐ, నాగార్జునసాగర్ ఎస్‌ఐలకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. బోర్లు వేసిన వ్యక్తులను పిలిపించి సమస్య పరిష్కరించకపోతే పురుగుమందు తాగి చనిపోతానని పేర్కొన్నారు.
రాజుపాలెం: ప్రకృతి వ్యవసాయంలో అమలు చేస్తున్న పంటల వైవిధ్యం, నేల ఆరోగ్య పరిరక్షణ, జీవ వైవిధ్యం పెంపు విధానాలు ఆదర్శంగా నిలుస్తాయని యూకేకు చెందిన గ్రోయింగ్ రియల్ ఫుడ్ ఫర్ న్యూట్రీషన్ సంస్థ కో ఫౌండర్ మాథ్యూ పేర్కొన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతు గుర్రాల మల్లికార్జురావు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మాథ్యూ, పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారిలు బుధవారం పరిశీలించారు. క్షేత్రంలో పది రకాల పండ్ల మొక్కలతోపాటు పీఎండీఎస్ విధానంలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాథ్యూ.. పొలంలోని నేల పరిస్థితి, వానపాముల ఉనికి, నేలలో సూక్మజీవుల చురుకుదనం, పంటల వైవిధ్యం, ఎరువుల తయారీ తదితర అంశాలను ఆసక్తిగా గమనించారు. ఆరోగ్యకరమైన నేల నుంచే నాణ్యమైన ఆహారం ఉత్పత్తి అవుతుందని పీఎం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యాంకర్ మౌనిక, జూనియర్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ శ్రీలేఖ, యంగ్ రీసెర్చ్ ఫెలో దేవిక, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ మాధవి, ఎన్‌ఎఫ్‌ఏ సైదయ్య, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


