వినియోగంలోకి వచ్చిన సెంట్రల్ లైటింగ్
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో విద్యుత్ దీపాలు సక్రమంగా వెలుగక రాత్రి వేళల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంపై ‘నిర్లక్ష్యపు చీకట్లు’ శీర్షికతో బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా సెంట్రల్ లైటింగ్ విద్యుత్ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టారు. మున్సిపల్ డీఈ రఫీ పనులను పర్యవేక్షించి మాట్లాడారు. హైఓల్టేజ్ కారణంగా ప్యానల్ బోర్డు దెబ్బతిందన్నారు. సాంకేతికత సమస్య తలెత్తి విద్యుత్ దీపాలు వెలగటం లేదని గుర్తించామన్నారు. మరమ్మతులు చేపట్టి సెంట్రల్ లైటింగ్‌ను పునరుద్ధరించినట్లు తెలిపారు. పట్టణంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా పరిశీలించి అవసరమైన చోట రిపేర్లు చేసి వీధి దీపాలను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. మల్లమ్మ సెంటర్‌లో సరిపడా విద్యుత్ కాంతి లేకపోవటంతో రాత్రి వేళ్లల్లో ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ట్రాఫిక్ సీఐతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని డీఈ తెలిపారు.


