మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి

Sep 10 2026 1:45 AM | Updated on Sep 10 2026 1:45 AM

జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి

నరసరావుపేట రూరల్‌: వినాయక మండపాలు, విగ్రహాలు ఏర్పాటుకు పోలీసు శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి తెలిపారు. అనుమతుల ప్రక్రియను వేగవంతం, సరళతరం చేసేందుకు సింగిల్‌ విండో విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా పోలీసు, ఫైర్‌, మున్సిపల్‌, విద్యుత్‌, రెవెన్యూ శాఖలకు సంబంధించిన అనుమతులు ఒకే చోట పూర్తిగా ఉచితంగా పొందవచ్చని వివరించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పరిశీలన తరువాత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు. అనుమతులు పొందిన క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ ఎన్‌వోసీని పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని మండపం వద్ద కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. మండపాలు ప్రజల రాకపోకలకు, అంబులెన్స్‌, ఫైర్‌ ఇంజిన్‌ వంటి అత్యవసర సేవలకు ఎలాంటి అటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద తగినంత వెలుతురు, విద్యుత్‌ భద్రత, అగ్నిమాపక పరికరాలు, మెరుగైన పారిశుద్ధ్యం వంటివి ఉండాలని తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, లౌడ్‌ స్పీకర్లు, డీజేలకు ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. నిమజ్జనాన్ని అధికారులు గుర్తించిన ప్రాంతాల్లో నిర్వహించి సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement