రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడు సమీపంలో శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌వే పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుంచనపల్లి గురుమూర్తి(50) మృతి చెందాడు. 30 ఏళ్లుగా కిరాణా వ్యాపారం చేస్తున్న గురుమూర్తి తన ద్విచక్రవాహనంపై సరుకుల కొనుగోళ్ల నిమిత్తం నరసరావుపేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో సంతగుడిపాడు నుంచి హైవేపై కొంత దూరం ప్రయాణించి పాలపాడు రోడ్డు మలుపు తిరుగుతుండగా స్కార్పియో కారు వెనుకగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన గురుమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రొంపిచర్ల ఎస్‌ఐ లోకేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన స్కార్పియో వాహనాన్ని అక్కడే వదిలివేసి డ్రైవర్, కారులో ఉన్నవారు పరారీ అయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు.


