నగరంపాలెం: ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించి, పోలీస్‌శాఖకు మంచి పేరు తేవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు బదిలీ అయిన తొమ్మిది మంది హెడ్ కానిస్టేబుళ్లు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిజాయతీ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని అన్నారు.
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులో అండర్–10, అండర్–14, మిక్స్‌డ్ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తామని ఫౌండేషన్ కార్యదర్శి జీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం ఏడు గంటలకు స్టేడియం టెన్నిస్ కోర్టులో రిపోర్ట్ చేయాలని కోరారు. వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు కూడా తీసుకురావాలన్నారు.
మేడికొండూరు: మండలంలోని పేరేచర్ల గ్రామంలోని ఒక రేషన్ దుకాణం నుంచి బియ్యం అక్రమ తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. డీలర్ దుకాణం మూసివేసి వెళ్లిపోగా, లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు.. వారి కోసం ఎదురు చూస్తుండగా బియ్యం అక్రమ వ్యాపారి తన అనుచరులతో వచ్చి దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అనంతరం మినీ లారీని వేగంగా డ్రైవ్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. గ్రామస్తులు పక్కకు తప్పుకోవడంతో లారీ తీసుకెళ్లిపోయాడు. ఇప్పటికే పలుమార్లు రేషన్ బియ్యం తరలించారని గ్రామస్తులు చెబుతున్నారు. రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం శనివారం 535.70 అడుగులకు చేరింది. ఇది 179.4878 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 6,553, ఎడమ కాలువకు 8,022, ఎస్‌ఎల్‌బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 16,875 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 16,875 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
నెహ్రూనగర్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ వినాయక చవితిని కాలుష్య రహితంగా జరుపుకొందామని జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా 11వ తేదీన నగరంలోని సుమారు 25 వేల మంది విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శనివారం జీఎంసీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ‘ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి’ నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు.


