ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు
గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లో ఓపీ వైద్య సేవలకు అరగంటసేపు విరామం ఇచ్చి నిరసన తెలియజేస్తామని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాబ్జి శ్యామ్‌కుమార్, జనరల్ సెక్రటరీ డాక్టర్ స్వరూప్‌కాంత్‌లు తెలిపారు. తమ నిరసనలో భాగంగా సోమవారం గుంటూరు వైద్య కళాశాలలో ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు నల్లబ్యాడ్జీలు ధరించారు. ఫ్లెక్సీలు చేతపట్టుకుని నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విడతల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సోమవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను కలిసి సమ్మె నోటీసు అందజేశామన్నారు. అందులో భాగంగా మంగళవారం నుంచి వారం పాటు రోజూ అరగంటసేపు ఓపీ వైద్య సేవలకు విరామం ప్రకటిస్తామన్నారు. జిల్లా సంఘం నేతలు డాక్టర్ అజయ్, డాక్టర్ రాజా, డాక్టర్ శివగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


