గుర్తుతెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి మృతి

Sep 1 2026 1:37 AM | Updated on Sep 1 2026 1:37 AM

నరసరావుపేట టౌన్‌: గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టూటౌన్‌ సీఐ ప్రభాకర్‌ సోమవారం తెలిపారు. పల్నాడు బస్టాండ్‌ అన్నా క్యాంటీన్‌ పక్కన సుమారు 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది పడిఉన్నాడన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించామన్నారు. మృతుడి అనవాళ్లు తెలిసినవారు టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం సమర్పించిన నాయకులు

నరసరావుపేట: గత ఎన్నికల సందర్భంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని వెంటనే అమలుచేసి నిలబెట్టుకోవాలని రజక నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఏపీ రజక ఎస్సీ సాధన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించి పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సాధన సమితి కోర్‌ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 1986లో ఎన్‌టీ రామారావు రాష్ట్ర క్యాబినెట్‌లో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేశారన్నారు. 2009లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రజకులు ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తుండగా అక్కడికి వచ్చి ఇప్పుడు బిల్లు పెడితే తాను ప్రతిపక్ష నాయకుడిగా బలపరుస్తానని చెప్పారన్నారు. ఆ తర్వాత 2014 పాదయాత్రలో చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే హామీ నెరవేరుస్తానని ఇచ్చారన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో గవర్నర్‌ ప్రసంగంలో అంశాన్ని దానికి కట్టుబడి ఉన్నానని ప్రకటించారన్నారు. 2024 మంగళగిరిలో బీసీ డిక్లరేషన్‌లో రజకుల చిరకాల కోరిక తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా పూర్తిచేస్తానని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా మాట నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వెంటనే రజకులను ఎస్సీ జాబితాలు చేర్చే దానికి కట్టుబడి ఉండాలని, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. కోర్‌ కమిటీ సభ్యులు బాదుగున్నల శ్రీను, అక్కెనపల్లి బాలయ్య, కోయ రామారావు, మక్కెన శ్రీను, భీమవరపు కోటేశ్వరరావు పాల్గొన్నారు.

పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం

పలు కేంద్ర పథకాల అమలు తీరుపై సమీక్ష

నరసరావుపేట: కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం (డీఈఐపీసీ) జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధ్యక్షతన సోమవారం నిర్వహించగా జిల్లా పరిశ్రమల అధికారి ఎస్‌.వి.సురేష్‌ కన్వీనర్‌గా వ్యవహరించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ కన్వీనర్‌ కలెక్టర్‌కు సమర్పించగా, వాటి అమలు పురోగతిని సమీక్షించారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న కేంద్ర పథకాల అమలు, వాటి కింద నిర్వహించిన సమావేశాలు కార్యక్రమాల పురోగతి, సింగిల్‌ డెస్క్‌ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన పారిశ్రామిక అనుమతుల దరఖాస్తుల స్థితిగతులు, వాటి పరిష్కారం నిర్ణీత గడువుల్లో అనుమతుల జారీపై చర్చించారు. పలు శాఖల జిల్లా అధికారులు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.

ఎయిడ్స్‌పై ప్రచారం వాహనం ప్రారంభం

ఏపీ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆదేశానుసారం ఇంటెన్సిఫైడ్‌ ఐఈసీ కాంపెయిన్‌–2026లొ భాగంగా జిల్లాలో హెచ్‌ఐవి,ఎయిడ్స్‌పై అవగాహన కోసం ఎల్‌ఈడీ వాహనం ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్ల తెలిపారు. వాహనానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వాహనం జిల్లాలో 15 రోజుల పాటు వివిధ గ్రామాల్లో బాగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు హెచ్‌ఐవిపై అవగాహన కొరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రత్న మన్మోహన్‌, జిల్లా లెప్రసి, ఎయిడ్స్‌, టీబీ అధికారి డాక్టర్‌ మాధవీలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement