మినహాయింపులు లేకుండానే ప్రత్యేక నోటిఫికేషన్ ఉద్యోగం ఉండాలంటే అర్హత పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఉపాధ్యాయుల డిమాండ్ పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా వేల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో ఆందోళన
అర్హత మార్కుల తగ్గింపు లేదు...
సత్తెనపల్లి: ఉపాధ్యాయ వృత్తి విద్యా కోర్సులైన బీఈడీ, డీఈడీలు పూర్తిచేసి డీఎస్సీలో, ఇంటర్వ్యూలో మంచి ర్యాంకు సాధించి ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులూ టీడీపీ ప్రభుత్వ నిర్వాకంతో నేడు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 30 ఏళ్ల సర్వీస్ తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాస్ కావాలంటూ విద్యాశాఖ ప్రత్యేక నోటిఫికేషన్ ఈ నెల 24వ తేదీన జారీ చేసింది. నూతన విద్యాహక్కు చట్టం ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లు సైతం టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నాటి నుంచి విద్యాహక్కు చట్టం–2009లో మార్పులు తేవాలంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పక్షాన విజయనగరంలో కలిసి టెట్ సమస్యపై పలు డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. తాజాగా జారీ చేసిన ప్రత్యేక టెట్ నోటిఫికేషన్‌లో ఆ వినతిపత్రంలోని ఏ ఒక్క డిమాండ్‌నూ పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
చట్ట సవరణకు పట్టు...
నూతన విద్యా చట్టం–2009 ప్రకారం దేశంలో టెట్ విధానం అమల్లోకి వచ్చింది. టెట్ పాస్ అయితేనే డీఎస్సీ రాసేందుకు అర్హత లభిస్తుంది. దీంతో ఏపీ సర్కారు 2011 నుంచి టెట్ నిర్వహిస్తోంది. అయితే 2011కి ముందు ఈ నిబంధన పై స్పష్టత లేకపోవడంతో ఆ కాలానికి ముందు ఉద్యోగాలు పొందిన వారు ఇంత వరకు టెట్ రాయలేదు. గత ఏడాది సుప్రీంకోర్టు ఓ తీర్పు వెలువరించింది. సర్వీస్ టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్‌లో 2028 ఆగస్టు 1వ తేదీలోపు ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. నాటి నుంచి విద్యాహక్కు చట్టం–2009 సెక్షన్ 23(1)సవరించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీడీపీ ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాధ్యం కాని పక్షంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌లో కులం, కేటగిరీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా 40 శాతం పాస్ మార్కులు ప్రకటించాలని, సీనియర్ టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉంటుందని, కాబట్టి పరీక్షను ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని, ఏ సబ్జెక్టు టీచర్‌కు అదే సబ్జెక్టులో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశాయి. కానీ, తాజా నోటిఫికేషన్‌ను నిరుద్యోగ అభ్యర్థుల మార్గదర్శకాలు, సిలబస్ మాదిరిగానే ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా జారీ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 2011కి ముందు ఉద్యోగాలు పొందిన వారు 8 వేల మంది వరకు ఉండొచ్చని అంచనా. వారందరి ఆశలను తాజా నోటిఫికేషన్ ఆవిరి చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణ షురూ..
విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. సెప్టెంబర్ 24 వరకు గడువు ఉంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 11 నుంచి 21వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఎస్జీటీలు పేపర్–1 రాయాలి. పదోన్నతికి అర్హత సాధించాలంటే ఆయా సబ్జెక్టుల్లో పేపర్–2 రాయాలి. ప్రతి పేపర్ కు రూ. వెయ్యి చొప్పున ఫీజు చెల్లించాలి.
ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా ఆయా సబ్జెక్టుల టెట్ పేపర్లలో ఉత్తీర్ణత తప్పనిసరి. నిరుద్యోగ అభ్యర్థుల మాదిరిగా తమకు టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ లేనందున, అందరికీ ఉమ్మడిగా ఒకే విధంగా అర్హత మార్కులు నిర్ణయించాలని సంఘాలు పట్టుబట్టినా ప్రయోజనం లేకపోయింది. ఈ నోటిఫికేషన్‌లో 150 మార్కులకుగాను ఎస్సీ, ఎస్టీలు 60 మార్కులు, బీసీలు 75 మార్కులు, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ టీచర్లు 90 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు.
వారందరు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అర్హత సాధించి, అత్యంత క్లిష్టమైన వడపోతలను దాటుకుని ఉపాధ్యాయ కొలువులు పొందారు. ఏళ్ల తరబడి విద్యాబోధనలో సుదీర్ఘమైన అనుభవం గడించిన వారే. ప్రస్తుతం ‘టెట్’ గండం ఎదురైంది. వృత్తిపరమైన అర్హతలు నిరూపించుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీస మినహాయింపులు కూడా ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్‌పై మండిపడుతున్నారు.


