నేడు బొప్పూడిలో గవర్నర్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు బొప్పూడిలో గవర్నర్‌ పర్యటన

Aug 27 2026 1:42 AM | Updated on Aug 27 2026 1:42 AM

పుష్కరిణి, గరుడవనం, ధ్వజస్తంభం పనులకు భూమిపూజ

చిలకలూరిపేట (యడ్లపాడు): బొప్పూడి కొండపై కొలువైన కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయానికి మహర్దశ రానుంది. ఆలయ సమగ్ర అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్‌ నుంచి మంజూరైన రూ.10.99 కోట్లతో చేపట్టనున్న పనులకు గురువారం రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో బొప్పూడి గ్రామం ముస్తాబైంది. కొండపై ఆలయంతోపాటు గ్రామంలోని ఆలయానికి చెందిన 114 ఎకరాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేయనున్నారు. పుష్కరిణి ఆధునికీకరణ, గరుడవనం, ధ్వజస్తంభం, కొండపైకి వెళ్లే మార్గాల అభివృద్ధి తదితర పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పైలాన్‌ ఆవిష్కరణతోపాటు మొక్కలు నాటే కార్యక్రమంలోనూ పాల్గొంటారు. పర్యటన ఏర్పాట్లను జేసీ కలెక్టర్‌ సంజనా సింహ బుధవారం పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఆర్డీవో కె.బాలకృష్ణ, డ్వామా పీడీ సిద్ధాలింగమూర్తి, డీపీవో ఎస్‌వీ నాగేశ్వరనాయక్‌, సోషల్‌ ఫారెస్ట్‌ డీఎఫ్‌వో డి.అశోక్‌కుమార్‌, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, ఆలయ ఈవో సుభద్ర, తహసీల్దార్‌ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఏఎస్పీలు రోహిత్‌చౌదరి, జేవీ సంతోష్‌, డీఎస్పీ ఎం.హనుమంతరావు, ఏఆర్‌ డీఎస్పీ గాంధీలు పర్యటన ప్రాంతాన్ని పరిశీలించారు. రూట్‌మ్యాప్‌, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. చిలకలూరిపేట రూరల్‌ సీఐ బి.సుబ్బానాయుడితో కలిసి పర్యటన మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బందికి సూచనలు చేశారు.

షెడ్యూలు ఇలా..

గురువారం ఉదయం 11.40 గంటలకు గవర్నర్‌ బొప్పూడి చేరుకుంటారు. 11.41కి పూర్ణకుంభంతో స్వాగతం, 11.46కు పుష్కరిణికి భూమిపూజ, 11.49 నుంచి 11.55 వరకు గరుడ విగ్రహానికి శంకుస్థాపన, శిలాఫలకం ఆవిష్కరణ ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు వేదాశీర్వచనం, ప్రసాదం అందజేత, 12.10కి బొప్పూడి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం వద్దకు చేరుకుంటారు. 12.20 నుంచి 12.27 వరకు అక్కడే కొండపైన వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి, మొక్క నాటి శిలాఫలకం ఆవిష్కరిస్తారు. 12.40కి గవర్నర్‌ తిరిగి వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement