అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకం కోడిగుడ్ల సరఫరా చేరిన వారంలోనే మురిగిపోతున్న వైనం కూటమి ప్రజాప్రతినిధుల సిఫార్సుతోనే సరఫరా కాంట్రాక్టులు చిన్నారులు, మహిళల ఆరోగ్యంతో టీడీపీ సర్కారు చెలగాటం
అధికార పార్టీ నేతలదే అసలు పాపం...
సాక్షి, నరసరావుపేట: చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం అందజేసే అంగన్‌వాడీ కోడిగుడ్ల నాణ్యత నాసిరకంగా మారుతోంది. ఆరోగ్యం కోసం అంగన్‌వాడీ కేంద్రాలలో పంపిణీ చేస్తున్న కోడిగుడ్లను చూస్తే పౌష్టికాహారం అందించడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోజురోజుకు కోడిగుడ్ల నాణ్యత క్షీణిస్తున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు. నిబంధనల ప్రకారం ఒక్కో కోడిగుడ్డు సగటను 50 గ్రాములకు పైగా బరువు ఉండాలి. ప్రస్తుతం జిల్లాలో అందజేస్తున్న గుడ్డు 40 నుంచి 45 గ్రాములు దాటడం లేదు. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాలలో సరఫరా చేస్తున్న కోడిగుడ్లు వారం రోజుల్లోనే పాడవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై అంగన్‌వాడీ సిబ్బంది సదరు కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారు. కోడిగుడ్లు ఇలానే ఉన్నాయని, సర్దుకోవాలని ఈ విషయం ఉన్నతాధికారులకు సైతం తెలుసని అంటున్నారని సమాచారం. దీంతో అంగన్‌వాడీ సిబ్బంది చేసేదేమిలేక ప్రజలతో మాటలు పడుతున్నామని వాపోతున్నారు. సాధారణంగా నిబంధనల ప్రకారం అంగన్‌వాడీలకు కోడిగుడ్లను సరఫరా చేయకపోతే సంబంధిత అధికారులు సదరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. సరైన సరుకు సరఫరా చేసేలా ఒత్తిడి తేవాలి. అయితే అధికారులు ఆ దిశగా చర్యలు తీసకున్న దాఖలాలు కనిపించడం లేదు.
చిన్న గుడ్లు మాకొద్దు...
అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు కోళ్ల ఫారాల నుంచి చిన్న గుడ్లను తక్కవ ధరకే కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫారాల్లో నాణ్యతఉన్న గుడ్లను మార్కెట్ తరలించి గ్రేడింగ్ ద్వారా వేరు చేసి చిన్న గుడ్లు, పాడయ్యే గుడ్లను కాంట్రాక్టర్లకు అమ్ముతున్నారని సమాచారం. ఇదే గుడ్లను అంగన్‌వాడీ కేంద్రాలకు తరలించి అధిక లాభాలను పొందుతున్నారు. కేంద్రాల వద్ద తల్లిదండ్రులు ఇవి తమకొద్దంటూ నిరాకరిస్తున్నారు. దీంతో కొన్ని కేంద్రాల వద్ద సిబ్బందికి, తల్లులకు మధ్య గొడవలు తరుచుగా జరుగుతున్నాయి. అధికారులు వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించాలని.. నాణ్యమైన కోడిగుడ్లను సరఫరా అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
పల్నాడు జిల్లా వ్యాప్తంగా 9 ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 2,031 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటికి కోడిగుడ్లును సరఫరా చేసే కాంట్రాక్టును అన్ని నియోజకవర్గాలలో అధికారపార్టీ నేతలే దక్కించుకున్నారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఇవ్వాల్సిన గుడ్ల నాణ్యత లేకుండా తక్కువ ధరకు లభించే చోట కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే ప్రజాప్రతినిధే తన సొంతమనిషితో కోడిగుడ్ల సరఫరా చేయిస్తున్నారని సమాచారం. నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన పరిమాణం, సమయంలో ఇవ్వడం లేదని ఆ నియోజకవర్గ అంగన్‌వాడీ సిబ్బంది వాపోతున్నారు. సాధారణంగా కేంద్రాలకు కోడిగుడ్లను సరఫరా చేసే సమయంలో పరిశీలించి తీసుకోవాల్సిన నిర్వహకులు అధికారపార్టీ ఒత్తిడితో బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు వేస్తున్నారట. చిన్న సైజు, కుళ్లిన కోడిగుడ్లు ఏమైనా ఉంటే వాటి స్థానంలో వేరేవి ఇవ్వాల్సి ఉండగా కాంట్రాక్టర్లు అందించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నెలలో రెండు, మూడు సార్లయినా కేంద్రాలను తనిఖీ చేయాల్సిన సూపర్‌వైజర్లు, సీడీపీఓలు తమకు టార్గెట్‌గా ఉన్న కేంద్రాలనే పదేపదే తనిఖీలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న సరకుపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లే దీనికి ప్రధాన కారణమని సమాచారం.


