అంగన్‌వాడీ పిల్లలకు ఆధార్ తప్పనిసరి
నరసరావుపేట: జిల్లాలో గ్రామ పంచాయతీలు, వార్డులు, పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. విజయవాడ నుంచి ఎన్నికల నిర్వహణ, సన్నాహాలు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఎన్నికల సామగ్రి సమీకరణ, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న ప్రక్రియను ఎన్నికల కమిషనర్‌కు వివరించారు.
ఓటర్ల తనిఖీ ప్రక్రియను కులాల వారీగా చేపడుతున్నామని, ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాలో ఎస్పీ పోస్టు ఖాళీగా ఉందని, బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కొంతమేర సిబ్బంది కొరత గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. తొలుత రాష్ట్ర కమిషనర్ మాట్లాడుతూ ముందుగానే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రి, ఎంపీటీసీ–జెడ్పీటీసీ ఫారాలు, బుక్‌లెట్లు, శిక్షణ తదితర ముందస్తు ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో నిష్పాక్షికత అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. నిర్దేశించిన సమయపట్టిక ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. కొత్త మండలాలు, జిల్లా పరిషత్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని అన్నారు. డీఆర్‌ఓ కె.అద్దెయ్య, డీపీఓ సుధాకర్, అధికారులు పాల్గొన్నారు.
‘సర్’పై ప్రతి అంశం తెలియజేయండి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై గురువారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌కు వచ్చే జిల్లా పరిశీలకులు, పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ రేవు ముత్యాల రాజుకు తమ అభిప్రాయాలు, సూచనలు, ఫిర్యాదులను జిల్లా ప్రజలు అందజేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులు, వారి ప్రతినిధులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల అధికారులతో ముత్యాలరాజు సమావేశం అవుతున్నారన్నారు.
అంగన్‌వాడీలలో ప్రతి ఒక్కరు ఆధార్ కలిగి ఉండాలని, ఐదేళ్లలోపు పిల్లలకు పేరెంట్ బయోమెట్రిక్ తీసుకున్నవారికి మాండేటరీగా బయోమెట్రిక్ అప్‌డేట్ జరగాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నరసరావుపేట, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, బొల్లాపల్లి మండలాల్లో పెండింగ్ ఎక్కువగా ఉందని, నెల రోజుల్లోగా డీఎల్‌డీఓతో కోఆర్డినేట్ చేసుకుని ఆధార్ అప్‌డేట్ చేయించాలన్నారు. క్యాంపులు ఏర్పాటు చేసి పిల్లలకు బయోమెట్రిక్ చేయించాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు
తెలిపిన జిల్లా కలెక్టర్


