చిలకలూరిపేట: గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామం కొండపై ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా జడ్జి వి. సాయి కల్యాణ చక్రవర్తి, అధికారులతో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా ఆలయంతో పాటు కోనేరు, ధ్వజస్తంభం, మెట్ల మార్గం, ఘాట్ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రూ. 10 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. అందులో గరుడ వాహనం ఏర్పాటుతోపాటు పుష్కరిణి శుభ్రపరచడం, కొండపైకి రోడ్డు నిర్మించడం, ఆలయ అభివృద్ధి పనులు ఉన్నాయన్నారు. ఈ పనులకు శంకుస్థాపన నిర్వహించేందుకు రాష్ట్ర గవర్నర్ రానున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ ఈవో కె. సుభద్ర మాట్లాడుతూ... ఆలయానికి 114 ఎకరాల భూమి ఉందని కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జడ్జి నరేంద్రరెడ్డి, ఆర్డీవో బాలకృష్ణ, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, డ్వామా పీడీ లింగమూర్తి, నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు, తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


