● ఇప్పటికీ పెండింగ్‌లో ఓ కేసు
● పూర్తికాని డివిజన్ల పునర్విభజన
నరసరావుపేట: నరసరావుపేట పురపాలక సంఘానికి ఎన్నికలు ప్రశ్నార్థకంగా మారాయి. ఎటువంటి అవరోధాలు లేని వంద మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందులో నరసరావుపేట ఉండే అవకాశం కనిపించడం లేదు. పురపాలక డివిజన్ల పునర్విభజన, ఓటర్ల మార్పుచేర్పులపై గతంలో తొమ్మిదిమంది రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడంతో 2021లో నిర్వహించాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన 15వ ఫైనాన్స్ నిధులు సుమారు రూ.15 కోట్లు ఆగిపోయాయని అధికారులు చెబుతున్నారు. కేసులు వేసిన వారిలో ఎనిమిది మంది తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నట్లు కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసినట్లు తెలిసింది. మరొకరు అంగీకారం తెలపాల్సి ఉంది.
డివిజన్ల ఖరారు కీలకం
దీంతోపాటు పట్టణానికి చుట్టుపక్కల ఉన్న ఐదు పంచాయతీల పరిధిలోని ప్రాంతాలను కలుపుతూ 34 వార్డులను 38గా చేస్తూ గత ప్రభుత్వం నివేదిక పంపించింది. అయితే ఇప్పుడు ప్రత్యేక గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న చిలకలూరిపేటలో 48 డివిజన్లుగా విభజించారు. అదే గ్రేడ్‌లో ఉన్న నరసరావుపేట మున్సిపాలిటీలో కూడా 48 డివిజన్లుగా విభజించాల్సిన అవసరం ఉంది. అది ఇప్పటివరకు జరగలేదు. అందువల్ల కోర్టు కేసులు ఉపసంహరించినా కూడా మొదటి దశలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. రెండో దశ నాటికి ఉన్న అవాంతరాలు మొత్తం తొలగించుకుంటే, రెండు నెలల గ్యాప్‌తో ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.


