● శాసీ్త్రయ సాగుకు ‘పొలం బడి’ వేదిక
● ఐదు జిల్లాల వ్యవసాయ అధికారులకు
ఓరియంటేషన్ శిక్షణలో జేడీఏ పద్మావతి
కొరిటెపాడు(గుంటూరు): రైతులకు శాసీ్త్రయ సాగు విధానాలను క్షేత్రస్థాయిలో చేరవేసి, ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపడుతున్న ‘పొలం బడి’ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఐదు జిల్లాలకు చెందిన వ్యవసాయ అధికారులకు గుంటూరులోని కృషి భవన్‌లో బుధవారం ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో గుంటూ రు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన మండల వ్యవసాయ అధికారులు, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. రైతులకు పొలం బడుల ద్వారా శాసీ్త్రయ సాగు పద్ధతులను ప్రత్యక్షంగా ఎలా బోధించాలనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. గుంటూరు జిల్లా వ్యవసాయ జేడీ ఎం.పద్మావతి మాట్లాడుతూ నిర్ధేశించిన విధి విధానాలను తప్పనిసరిగా పాటించడం ద్వారా రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు లభించి అధిక లాభం పొందడంతో పాటు సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రతి జిల్లాలో ఖరీఫ్‌లో ఒక ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ (మేలైన యాజమాన్య పద్ధతులపై) పొలంబడి కార్యక్రమం, రబీలో ఒకటి లక్ష్యంగా చేయాలని సూచించారు. ఎస్‌ఓపీసీఏ అధికారిణి డాక్టర్ సారిక మాట్లాడుతూ ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ విధానంలో రైతులను, ఎఫ్‌పీఓకి అనుసంధానం చేసి వారు పండించిన పంట ఉత్పత్తుల నాణ్యతను ఎన్‌ఏబీఎల్ అక్రిడేషన్ ల్యాబ్‌ల ద్వారా పరీక్షించి స్కోప్ సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతోందన్నారు. దీనిద్వారా ఆన్‌లైన్ డిజిటల్ మార్కెట్ ప్లాట్ ఫామ్‌లలో వారి ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముకునే అవకాశం లభిస్తోందని వివరించారు. డీడీఏలు సునీత, పీవీ హేమలత, ఏడీఏ ఎం.వెంకటేశ్వర్లు, ఐదు జిల్లాల ఏఓలు, ఏడీఏలు పాల్గొన్నారు.


