మాచర్ల: ఆర్టీసీ ప్రైవేటీకరణను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేశారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సులను సంస్థే చేపట్టాలని, ప్రైవేటీకరణ చేయకూడదని, సీ్త్ర శక్తి జీరో టికెట్ ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలని, 4వేల డిజిల్ బస్సులను కొనాలని, 15వేల ఖాళీలను పూర్తిచేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. నాయకులు సోమయ్య, నరహరి, ఎంవీకే చారి, నీలంరాజు, సురేష్, మురహరి, మల్లారెడ్డి, శివయ్య ఆధ్వర్యంలో మహిళా కండక్టర్లు, డ్రైవర్లు, ఉద్యోగులు, నిరసనలో పాల్గొన్నారు.
మాచర్ల: పల్నాడు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2025–26 విద్యా సంవత్సరానికి చేరేందుకు ఆసక్తి కలిగి దరఖాస్తు చేసుకొన్నవారందరూ ఈ నెల 13న జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని జిల్లా కన్వినర్ పి.పవన్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాచర్ల ప్రభుత్వ ఐటీఐలో జరిగే సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులను సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, అధికారులను ఆదేశించారు. ప్రాధాన్య రంగాల అధికారులతో స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు అధిక మోతాదులో వినియోగించకుండా అవగాహన కల్పించాలని కోరారు. యూరియా, డీఏపీ ఎరువులను ఏపీ–ఎయిమ్స్ యాప్ ద్వారా పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. పంట వేసే రైతుకు మాత్రమే ఎరువులు అందాలని, బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలకు విక్రయించడం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ఎరువులు కొనుగోలు నిమిత్తం పంట భూమి వివరాలు, సాగు చేసే పంటల వివరాలు ఆయా రైతు సేవా కేంద్రాలలో సర్వే నంబరు, ఖాతా నంబరు, విస్తీర్ణం, పంట సరిగా ఉన్నట్లు రైతు సేవ కేంద్రం సహాయకుల ద్వారా సరిచూసుకోవాలని సూచించారు. ఎక్కడైనా విత్తనాలు అవసరం ఉంటే వెంటనే పంపిణీ చేసే విధంగా సిద్ధంగా ఉండాలని కోరారు.


