గంగలకుంటలో వివాహిత హత్య | - | Sakshi
Sakshi News home page

గంగలకుంటలో వివాహిత హత్య

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

గంగలకుంటలో వివాహిత హత్య లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి ఎస్‌ఐ కారు ఢీకొని యువకుడు మృతి ఆటో–లారీ ఢీ–ఒకరు మృతి

ఇరువురు మహిళలకు తీవ్ర గాయాలు గుంతలమయంగా ఉన్న రోడ్డు వల్లే ప్రమాదం

వెల్దుర్తి: మండలంలోని గంగలకుంటలో సోమవారం తెల్లవారుజామున ఓ మహిళ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొల్లి వీరమ్మ (50) అర్థరాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. వీరమ్మను సమీప బంధువులే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అర్థరాత్రి వర్షం కురిసిన సమయంలో ఈ సంఘటనకు పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. కొడుకు కొల్లి అంజి ఫిర్యాదు మేరకు మాచర్ల రూరల్‌ సీఐ షేక్‌ నఫీజ్‌ బాషా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రాజుపాలెం: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై చౌటపాపాయపాలెం బస్టాప్‌ సమీపంలో సోమవారం జరిగింది. కొండమోడుకు చెందిన పందిటి సాయిదుర్గారెడ్డి(23) సత్తెనపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల నుంచి గుంటూరు వెళ్తున్న లారీ ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మణికృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. మృతుడు అవివాహితుడు. ఇటీవల మృతుని తండ్రి పుల్లారెడ్డి అనారోగ్యంతో మృతిచెందడం కొద్దిరోజుల వ్యవధిలోనే కుమారుడి మరణం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

చిలకలూరిపేట టౌన్‌ :రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. అర్బన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంతరోడ్డు ప్రాంతంలో నివాసం ఉండే వీసా సురేష్‌ (34) కేటగిరింగ్‌ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. తండ్రి పది సంవత్సరాల కిందట మృతిచెందడంతో తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఈనెల 6వ తేదీ సాయంత్రం పట్టణంలోని ఎన్‌ఆర్టీ సెంటర్‌లో జాతీయ రహదారి దాటుతున్న సమయంలో చిలకలూరిపేట నుంచి ఒంగోలు వైపు వెళుతున్న రూరల్‌ ఎస్సై చెల్లి రమేష్‌ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో సురేష్‌ తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని పట్టణంలోని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగై చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం జీజీహెచ్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని సోదరుడు సురేంద్ర ఫిర్యాదు మేరకు అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి వివాహం కాలేదు.

దుర్గి: మండల పరిధిలోని పోలేపల్లి జంక్షన్‌ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో–లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇరువురు మహిళలకు గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓబులేశునిపల్లి గ్రామానికి చెందిన బొజ్జా కోటేశ్వరరావు (40) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆటోను లారీ ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఆటోలో ఉన్న కారంపూడి మండలం నలమాలపాడు గ్రామానికి చెందిన ఇరువురు మహిళలకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రధాన రహదారిపై గోతులు పడడంతో ప్రమాదానికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. అతివేగంగా వస్తున్న లారీ గుంతలను తప్పించే క్రమంలో ఆటోను ఢీకొనడంతో ఈప్రమాదం చోటు చేసుకుంది. గతంలో కూడా గుంతలు రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. సమాచారం అందుకున్న పో లీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement