భారీగా రుసుములు పెంచిన కేంద్రం ఆందోళన చెందుతున్న వాహనదారులు
పట్నంబజారు: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఊహించని విధంగా ఫిట్నెస్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పెను భారాన్ని మోపుతోంది. కేంద్ర ప్రభుత్వం వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఫీజులను గణనీయంగా పెంచుతూ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ప్రధానంగా పాత వాహనాలపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా 15 సంవత్సరాల పైబడిన వాహనాల పునరుద్ధరణ (రెన్యూవల్) కోసం వచ్చిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో ప్రైవేట్ కార్ల ఫిట్‌నెస్ ఫీజు కేవలం రూ.600 ఉంది. గత సంవత్సరం నవంబర్‌లో తీసుకున్న సవరణలతో ఇది రూ.5 వేలకు పెరిగింది. ద్విచక్ర వాహనాలకు రూ.200 కాగా రూ.1,000 కి పెరిగింది. మూడు చక్రాల వాహనాలకు రూ. 400 ఉండగా రూ.2,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కమర్షియల్ వాహనాల విషయంలో పెంపు మరింత ఎక్కువగా ఉంది. గూడ్స్ వాహనాలు, బస్సుల వంటి భారీ వాహనాలకు ఫిట్‌నెస్ ఫీజు గతంలో రూ.1,000 ఉంది. ఇప్పుడు రూ.12,500 కు పెరిగింది. మిడిల్ కేటగిరీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు రూ.800 నుంచి రూ.10 వేల వరకు పెంపు అమల్లోకి వచ్చింది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఆలస్యంగా రెన్యూవల్ చేస్తే అదనంగా జరిమానా కూడా విధించనున్నారు. ఉదాహరణకు, లైట్ మోటార్ వాహనాలకు రోజుకు రూ. 50 వరకు, భారీ వాహనాలకు రోజుకు రూ. 100 వరకు లేట్ ఫీజు విధిస్తున్నారు. పాత వాహనాల వినియోగం తగ్గించి కాలుష్యాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒక్కసారిగా భారీగా పెరిగిన ఈ ఫీజులు సాధారణ వాహనదారులపై ఆర్థిక భారం పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదనపు భారమే
15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఒకే రకం చార్జీలు అమలు చేస్తున్నారు. 20 సంవత్సరాలు దాటిన ద్విచక్ర వాహనాలకు రూ. 2 వేలు, మూడు చక్రాల వాహనాలకు రూ.7 వేలు, కార్లు (లైట్ మోటార్ వెహికల్స్)కు రూ.15 వేలు, మధ్యస్థ వాహనాలకు రూ. 20 వేలు, భారీ వాహనాలకు రూ.25 వేలు ఫిట్‌నెస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. జిల్లా పరిధిలో వివిధ రకాల వాహనాలు కలిపి సుమారు లక్షకుపైగా ఉన్నాయి. ఇప్పటికే బాడుగ లేకపోవడంతోపాటు డీజిల్, పెట్రోల్, వాహన విడి భాగాల ధరలూ కొండెక్కి కూర్చున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.


