బాలికలకు అందుబాటులో సకల సౌకర్యాలు జిల్లాలో 24 కేజీబీవీల్లో 1,920 సీట్లు ఇప్పటికే 2,020 వరకు దరఖాస్తులు గడువు పెంపుతో మరిన్ని వచ్చే అవకాశం
ఎంపిక ప్రక్రియ, పర్యవేక్షణ ఇలా ...
అడ్మిషన్లకు విద్యార్థులు (ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్) వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపికై న విద్యార్థినులకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం పంపుతారు.
ఎంపిక జాబితాను సంబంధిత కేజీబీవీ బాలికల విద్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
గ్రూపులు ఇలా...
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూప్ నరసరావుపేట, నకరికల్లు, నాదెండ్ల, అచ్చంపేట, క్రోసూరు, దాచేపల్లి, మాచవరంలో ఉంది.
బైపీసీ గ్రూప్ సత్తెనపల్లి, ముప్పాళ్ళ, బెల్లంకొండ, బొల్లాపల్లి, దుర్గి, గురజాల, రెంటచింతల, వెల్దుర్తి, నూజెండ్లలో అందుబాటులో ఉంది.
సీఈసీ గ్రూపు చిలకలూరిపేట, కారంపూడి, పిడుగురాళ్ల, రాజుపాలెం, రొంపిచర్ల, వినుకొండలో అందుబాటులో ఉంది.
ఎంఈసీకి ఈపూరు, సీఎస్‌ఈకి మాచర్ల కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో అవకాశం కల్పించారు.
సత్తెనపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అనాథ, డ్రాపౌట్స్, వెనుకబడిన తరగతుల బాలికలకు ఉచితంగా విద్య అందించాలనే ఉద్దేశంతో కస్తూర్బాగాంధీ (కేజీబీవీ) విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే అవకాశం ఉంది. నాణ్యమైన విద్య అందించడంతోపాటు ఉచిత వసతి, పోషక విలువలతో కూడిన భోజనం, సురక్షితమైన వాతావరణం వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగింది. జిల్లాలోని 24 కేజీబీవీలో ఆరో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి కేటాయించిన 1,920 సీట్ల కోసం అధికంగా పోటీ పడుతున్నారు. జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు గడువు ఈ నెల 10వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థినుల అభ్యర్థన మేరకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి ఆరో తరగతికి 11,00 దరఖాస్తులు, ఇంటర్ మొదటి సంవత్సరానికి 920 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు గడువును మరో వారం పెంచడంతో మరిన్ని వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవీ సీట్ల వివరాలు...
జిల్లాలో బాలికల అక్షరాస్యత శాతాన్ని పెంచడంతోపాటు అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల పరిధిలో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలోని నరసరావుపేట, నకరికల్లు, నాదెండ్ల, మాచవరం, క్రోసూరు, దాచేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ, బొల్లాపల్లి, దుర్గి, గురజాల, నూజెండ్ల, రెంటచింతల, వెల్దుర్తి, సత్తెనపల్లి, ముప్పాళ్ళ, చిలకలూరిపేట, కారంపూడి, పిడుగురాళ్ల, రాజుపాలెం, రొంపిచర్ల, వినుకొండ, ఈపూరు, మాచర్లలో ఈ విద్యాలయాలు ఉన్నాయి. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి 24 కేజీబీవీలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఒక్కో కేజీబీవీలో 40 చొప్పున 960 సీట్లు, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి ఒక్కో కేజీబీవీలో 40 చొప్పున 960 సీట్లు భర్తీ కానున్నాయి.
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశానికి అర్హులైన బాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కేజీబీవీలో నాణ్యమైన విద్యతోపాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. ఈ నెల 10వ తేదీతో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసినప్పటికీ, 20వ తేదీ వరకు గడువు పెంచారు.
– రేవతి, జీసీడీఓ,
పల్నాడు జిల్లా


