నిత్యం ప్రసవ వేదనే | - | Sakshi
Sakshi News home page

నిత్యం ప్రసవ వేదనే

Apr 13 2026 7:38 AM | Updated on Apr 13 2026 7:38 AM

నిత్యం ప్రసవ వేదనే

న్యూస్‌రీల్‌

ఇంకెన్నాళ్లీ కష్టాలు..

గైనకాలజీ వార్డులో పనిచేయని ఫ్యాన్లు అద్దె ఫ్యాన్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉక్కపోతతో తల్లడిల్లుతున్న తల్లీబిడ్డలు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు శూన్యం పేదల కష్టాలు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం మంత్రి రాకపోవడంతో ఆగిన ప్రసూతి విభాగం తరలింపు

సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సర్కార్‌ ఆసుపత్రిలో వసతులు కరువయ్యాయి. అంతులేని నిర్లక్ష్యంతో గర్భిణులు, బాలింతలు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతుల లేమి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నెలలు నిండి పండంటి బిడ్డ కోసం ఆస్పత్రి గడప తొక్కితే.. ఊపిరి ఆడక గర్భిణులు అవస్థలు పడుతున్నారు. నడినెత్తిన సూరీడు నిప్పులు కక్కుతుంటే.. ప్రభుత్వ ఆసుపత్రి చెమటలు పట్టిస్తోంది. రోగులే ఫ్యాను తెచ్చుకోక తప్పడం లేదు.

నరసరావుపేట టౌన్‌: ప్రభుత్వ ఆసుపత్రి గడప తొక్కినప్పటి నుంచి గర్భిణులు సమస్యలతో విలవిలలాడుతున్నారు. కార్పొరేట్‌ వైద్యశాలకు వెళ్లలేని పేదలు ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తే కనీస సౌకర్యాలు లేక తల్లీబిడ్డలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా తీవ్ర ఉక్కపోతతో గర్భిణులు, బాలింతలు నరకయాతన అనుభవిస్తున్నారు. వైద్యశాలలో ఉండాలంటే ఇంటి నుంచి ఫ్యాను తెచ్చుకోవాలి. లేకుంటే అద్దె ఫ్యానులు ఏర్పాటు చేసుకోవాలని సిబ్బంది సూచనలు ఇవ్వటం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. ఇది పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా ప్రభుత్వ వైద్యశాల దుర్భర పరిస్థితి. మౌలిక వసతులు, మెరుగైన వైద్యసేవలు అందక గర్భిణులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. సుఖప్రసవం జరగాలంటే వారికి పరిశుఽభ్ర వాతావరణం, ఇతర మౌలిక సౌకర్యాలుండాలి. కానీ ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి చూస్తే కనీసం మానవత్వం కూడా లేకుండా వ్యవహరిస్తున్న వైనం కళ్లకు కనిపిస్తోంది. ముఖ్యంగా గైనిక్‌ విభాగంలో ఫ్యాన్లు తిరగక పోవటంతో బాలింతలు ఉక్కపోతకు తల్లడిల్లిపోతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై చెట్ల కింద సేద తీరుతున్నారు. గర్భిణులకు శస్త్రచికిత్స అనంతరం ఏసీ సౌకర్యం ఉన్న హెచ్‌డీ యూనిట్‌కు తరలిస్తారు. అక్కడ కొన్ని నెలలుగా ఏసీలు పనిచేయటం లేదు. రిపేరు చేయించి వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టడంలేదు. గర్భిణులు ప్రసవాలకు చేరే సమయంలోనే సిబ్బంది రోగులకు ఇంటి నుంచి ఫ్యానను తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. వైద్యశాల సమీపంలో అద్దెకు ఇచ్చే దుకాణాల్లో టేబుల్‌ ఫ్యాన్లులు తెచ్చుకొని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. మరో దారి లేక ఆర్థిక భారమైనప్పటికీ బాలింతలు టేబుల్‌ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకొని వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఎన్నో నెలలుగా సమస్య ఉన్నప్పటికీ వాటి గురించి వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటంతో బాలింతలకు కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు ఫ్యానన్లను అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అప్పుడే పుట్టిన పసికందుకు ఫ్యాను లేకపోవటంతో ఊపిరాడక ఏడుస్తుంటే ఓదార్చలేక బాలింతలు తల్లడిల్లిపోతున్నారు. దీంతో రోజుకు రూ.150 వరకు చెల్లించి అద్దె ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు.

మంత్రి రాక ప్రారంభం వాయిదా

సమస్యల దృష్ట్యా గైనిక్‌ విభాగాన్ని లింగంగుంట్లలో నిర్మించిన నూతన భవనానికి మార్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అందుకోసం పురుషుల జనరల్‌ వార్డును పై అంతస్తుకు మార్చి ఆ స్థానంలో ప్రసూతి విభాగాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. గత నెలలో ప్రారంభించాలని భావించారు. అయితే మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అపాయింట్‌మెంట్‌ లభించక పోవటంతో ఇది కాస్తా వాయిదా పడింది. దీంతో గర్భిణులు ఇంకా పాత భవనంలోనే కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఇకనైనా తగిన వసతులు కల్పించాలని గర్భిణులు, బాలింతలు, వారి సహాయకులు కోరుతున్నారు.

పాత ప్రభుత్వ వైద్యశాలలో ప్రసూతి విభాగానికి సేవల కోసం అక్కడకు వెళ్లిన గర్భిణులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గైనిక్‌ విభాగానికి ప్రతిరోజు 150 నుంచి 200 మంది జిల్లా నలుమూల నుంచి గర్భిణులు సేవల కోసం వస్తుంటారు. వీరిలో ఇన్‌ పేషంట్‌లుగా 80 మంది వరకు ఉంటారు. ప్రతిరోజు 10 వరకు కాన్పులు అవుతుంటాయి. గైనిక్‌ విభాగంలో ఉక్కపోతకు తోడు శిథిలావస్థకు చేరిన భవనంతో భయాందోళనలు చెందుతూ రోగులు గడపాల్సి వస్తోంది. శ్లాబ్‌ పైఅంతస్తు పెచ్చులూడి తరుచూ అచ్చులు పడుతున్నాయి. చిరిగిన పరుపులతో నిద్రకు ఆటంకం కలుగుతుందని రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా రక్తపరీక్షల కోసం పైఅంతస్తుకు వెళ్లాల్సి రావటంతో గర్భిణులు మెట్లు ఎక్కలేక నానా అవస్థలు పడుతున్నారు. సమస్య అధికారుల దృష్టిలో ఉన్నా పరిష్కరించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా బాలింతలకు కఠిన పరీక్షలు ఎదురవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement