వైఎస్సార్‌ సీపీకి కార్యకర్తలే ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీకి కార్యకర్తలే ముఖ్యం

Feb 21 2026 7:32 AM | Updated on Feb 21 2026 7:32 AM

వైఎస్సార్‌ సీపీకి కార్యకర్తలే ముఖ్యం

వైఎస్సార్‌ సీపీకి కార్యకర్తలే ముఖ్యం

ఉదాసీనంగా చంద్రబాబు ప్రభుత్వం

విలేకరుల సమావేశంలో

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి,

జిల్లా పరిశీలకులు గౌతమ్‌రెడ్డి

ప్రతి నియోజకవర్గంలో

జగనన్న సైన్యం ఏర్పాటు

నరసరావుపేట: వైఎస్సార్‌ సీపీకి కార్యకర్తలే ముఖ్యమని, కింది నుంచి పైస్థాయి వరకు వీరందరిని గుర్తించాలని పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జిల్లా పరిశీలకులు పూనూరి గౌతమ్‌రెడ్డి, ఇతర నాయకులతో కలసి గోపిరెడ్డి మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఏడు నుంచి ఎనిమిది వేల మందితో జగనన్న సైన్యాన్ని ఈనెలాఖరులోపు తయారుచేయటం పూర్తవుతుందన్నారు. ప్రతి కార్యకర్తకూ గుర్తింపు కార్డులు పార్టీ కేంద్ర కార్యాలయంలో డిజిటలైజేషన్‌ చేయటం జరుగుతుందన్నారు. వీరందరూ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని కేంద్ర కార్యాలయం పరిశీలిస్తుందన్నారు. ఇప్పటికే సుమారు 70 శాతం నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్‌ పూర్తయిందన్నారు. ప్రతి ఒక్కరికీ వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో గుర్తింపు కార్డులు అందజేస్తారని తెలిపారు. కమిటీలో ఉన్న ప్రతి సభ్యుడికి సాధారణ, ప్రమాద బీమా అందిస్తారన్నారు. దీని తర్వాత రెండో ఫేజ్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమౌతుందన్నారు. సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి సైతం బీమా చేస్తారన్నారు. జూలై 12న వైఎస్సార్‌ జయంతి నాటికి అన్నీ పనులు పూర్తిచేస్తారన్నారు. జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో మంచి స్పందన లభిస్తుందన్నారు.

ఏడు నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరేస్తాం

జిల్లా పరిశీలకులు పూనూరి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా కార్యాలయం ప్రారంభించి ఇక ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించాలనే పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాము ఇక్కడ సమావేశమయ్యాని చెప్పారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగరాలనే లక్ష్యానికి తామంతా కంకణబద్ధులై ఉన్నామన్నారు.

లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారానికి

నామరూపాలు లేకుండా పోతారు

తిరుపతి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా జంతు కొవ్వు కలిసిందని చెప్పటం మొదటి తప్పన్నారు. సీబీఐ సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పినప్పటికీ కర్నూలు సభలో మళ్లీ జంతువు కొవ్వు, బాత్రూమ్‌లు క్లీన్‌చేసే లప్సా కలిసిందని అబద్ధాలు చెప్పటం చాలా దారుణం అన్నారు. ఇవన్నీ ప్రజలను మరోసారి మోసం చేయటానికే చేస్తున్నాడన్నారు. ఆ దేవ దేవుడు వెంకటేశ్వరుడితో పెట్టుకున్న వారెవరూ ఇంతవరకు బాగుపడలేదని, ఆ భగవంతుడికి ఆ శక్తి ఉందని, వారు నామరూపాలు లేకుండా పోవటం ఖాయమని ప్రకటించారు.

రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బాలికా సంరక్షణ పథకం (జీసీపీఎస్‌) 20 ఏళ్ల కిందట ప్రకటించిన విధంగా ప్రతి ఒక్క ఆడపిల్లకు రూ.లక్ష, ఇద్దరు ఉంటే రూ.30వేలు చొప్పున రూ.60వేలు ఇవ్వాల్సి వుందన్నారు. శిశు సంక్షేమశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,39,943 మంది బాలికలు ఆనాడు నమోదు చేసుకున్నారన్నారు. వీరికి గాను ప్రస్తుత ప్రభుత్వం రూ.4,400 కోట్లు చెల్లించాల్సి వుందన్నారు. వీరందరూ ఇప్పుడు కలెక్టర్లకు అర్జీలు పెట్టినా ఎటువంటి స్పందన లేదని అన్నారు. నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులు యెనుముల మురళీధర్‌రెడ్డి, పడాల శివారెడ్డి, దొంతిరెడ్డి అంజిరెడ్డి, నూతలపాటి హనుమయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement