అక్షరాల అద్భుతం...ప్రకృతి సందేశం
● సామరస్య రమజాన్..భక్తిమయ లెంట్ ● భిన్నమతాల ఉపవాస దీక్షల సంగమం
యడ్లపాడు: విశ్వాసాల బాటలు వేరైనా పరమాత్మను చేరుకోవాలనే తపన ఒక్కటేనని చాటిచెబుతూ.. కాలచక్రం ఈ ఏడాది ఒక అరుదైన ఆధ్యాత్మిక అద్భుతాన్ని ఆవిష్కరించింది. గగనతలంలో సూర్యచంద్రుల గమనాలు వేరైనా రెండు వేర్వేరు ధర్మాల ఉపవాస దీక్షలను ఒకే వేదికపైకి తీసుకువచ్చాయి. చాంద్రమాన గణనతో ఏటా 11 రోజులు ముందుకు జరిగే రమజాన్ మాసం, సూర్యమాన ఆధారిత లెంట్ దీక్షలతో అరుదైన ఖగోళ వింత కారణంగా, హిజ్రీ 1447 నెలవంక దర్శనం, క్రైస్తవుల యాష్ వెడ్నెస్ డే ఒకే రోజైన ఫిబ్రవరి 18న ప్రారంభమయ్యాయి. గ్రెగోరియన్, హిజ్రీ కాలచక్రాల అద్భుత కలయికతో రెండు భిన్న ధర్మాలు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఏకకాలంలో మొదలుపెట్టడం విశేషం. 1993 నాటి ఆ అరుదైన స్మృతి, మళ్ళీ 2026లో మళ్లీ పునరావృతమైంది. సరిగ్గా 33 ఏళ్ల తర్వాత ప్రకృతి ప్రసాదించిన ఈ మౌన సందేశం సర్వమత సామరస్యానికి, ఐక్యతకు పతాక చిహ్నంగా నిలుస్తోంది.
రెండు ధర్మాలు..ఒకే లక్ష్యం
మార్గాలు వేరైనా, ఈ రెండు మతాల ఉపవాస దీక్షల అంతిమ లక్ష్యం ఒక్కటే. వాటి మధ్య ఉన్న పోలికలు అద్భుతమైన మానవీయ విలువలను చాటిచెబుతున్నాయి. రమజాన్‌లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు కూడా ముట్టకుండా ముస్లింలు కఠినమైన రోజా పాటిస్తే, లెంటెల్ కాలంలో 40 రోజుల పాటు భోజనాన్ని త్యాగం చేస్తూ, ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటూ క్రైస్తవులు ప్రార్థనలు చేస్తారు. ముస్లింలు జకాత్ రూపంలో పేదలకు సంపదను పంచుతుంటే, క్రైస్తవులు తమ పొదుపును ధర్మకార్యాల ద్వారా ఆర్తులకు అందజేస్తారు. ఈ రెండింటిలోనూ భక్తులు ప్రాపంచిక సుఖాలను వీడి, దానధర్మాలను చేస్తూ దేవుని దగ్గరయ్యేందుకు ఆయన ఆజ్ఞలను పాటించడమే.
సామరస్యానికి వారధి
ఒకే సమయంలో మసీదుల నుంచి అజాన్ వినబడటం, చర్చిల నుంచి ప్రార్థనా గీతాలు ఆలపించడం సమాజంలో ఐక్యతకు పతాక చిహ్నంగా మారుతోంది. రెండు మతాల్లో వేర్వేరు నమ్మకాలు ఉన్నప్పటికీ, అందరూ ఒకేసారి ఉపవాస దీక్షల్లో ఉండటం వల్ల పరస్పర గౌరవం, శాంతి పెంపొందుతాయని మత పెద్దలు ఆకాంక్షిస్తున్నారు. ఈ 33 ఏళ్ల అరుదైన సమయం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేలా ఈ దీక్షల్లోని తొలి శుక్రవారం ముస్లింలతో మసీదులు, క్రైస్తవులతో చర్చీలు నిండి కళకళలాడాయి. నిజంగా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సందర్భమని ఇరుమతాలకు చెందిన పెద్దలు చెబుతున్నారు.
అక్షరాల అద్భుతం...ప్రకృతి సందేశం


