బాబూ..వరాల మాటేమిటి?
కళాశాలల మాటేమిటి..?
చంద్రబాబు మోసాలను గుర్తు చేసుకుంటున్న ప్రజలు
● వినుకొండకు వెటర్నరీ కాలేజ్
మంజూరు చేస్తామని వరం
● శావల్యాపురంలో పాలిటెక్నిక్
కళాశాల ఏర్పాటుచేస్తామని హామీ
● ట్రామా కేర్, 100 పడకల
ఆసుపత్రులను మంజూరు చేసిన
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
● రెండేళ్లుగా వాటి పనులు
చేపట్టకుండా కుట్రలు
● నేడు చంద్రబాబు వినుకొండ పర్యటన
సాక్షి, నరసరావుపేట: హామీలివ్వడం వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఓటర్లను మభ్యపెట్టడం బాబు నైజం. వెనుకబడిన పల్నాడు జిల్లాలో మరింత వెనుకబాటుకు గురైన వినుకొండ నియోజకవర్గానికి చంద్రబాబు ఎన్నో హామీలను ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా వాటిని అమలు చేయకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినుకొండ పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రాంతానికి చేసిన వాగ్దానాలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల 70 ఏళ్ల చిరకాల కోరిక వరికపూడిశెల ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్టు చంద్రబాబుకు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొస్తుంది. అధికారంలోకి వస్తే వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మిస్తామంటారు... వచ్చిన తర్వాత ఆ మాటే మర్చిపోతారు. చంద్రబాబు నాయుడు అయితే పల్నాడు వాసుల ఓట్ల కోసం వరికపూడిశెలకు ఏకంగా రెండుసార్లు శంకుస్థాపన చేసి ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టారు. యువగళం పేరిట పాదయాత్ర చేసిన నారా లోకేష్ వినుకొండ నియోజకవర్గం కొండ్రముట్ల వద్ద వరికపూడిశెల ప్రాజెక్టు హామీనిస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించడం గమనార్హం. 2024 ఎన్నికల్లో గెలిస్తే ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని రెండేళ్లు అవుతున్నా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. సుమారు 1.25 లక్షల ఎకరాలకు సాగు, లక్షమందికి తాగునీరు అందించే విధంగా డీపీఆర్‌ను రూపొందించి అవసరమైన కేంద్ర అనుమతులను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. 2023 నవంబర్‌లో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ప్రాజెక్టు పనులను పక్కనపెట్టారంటూ వైఎస్సార్‌సీపీ, కమ్యూనిస్టు నేతలు ఆరోపిస్తున్నారు. తాజా బడ్జెట్‌లో సైతం ఈ ప్రాజెక్టు పనులకు ఒక్క రూపాయి విడుదల చేయలేదంటే ఈ ప్రాజెక్టు పట్ల వారి చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు వినుకొండలో వరికపూడిశెలపై చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలని, త్వరగా పనులు పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వినుకొండ పట్టణంలో వెటర్నరీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు కాలేజీ ప్రారంభం కాలేదు. మరో వైపు శావల్యాపురంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తామని గతంలో సీఎం హోదాలో ప్రకటించిన చంద్రబాబు ఆ ఊసే మరచిపోయారని ఆ మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వినుకొండలో లెదర్ పార్క్ తెచ్చామంటూ తెగ హడావుడి చేశారు. స్థానిక టీడీపీ నేతలు ప్రకటనలు, ప్రసంగాలు చేశారు. తీరా చూస్తే ఆ లెదర్ పార్క్ ఏమైందో, దాని ఆచూకీ ఎవరూ చెప్పడంలేదు. వెనుకబడిన వినుకొండ నియోజకవర్గానికి తాగు, సాగు నీరు సదుపాయాలతోపాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బాబూ..వరాల మాటేమిటి?


