జీఎస్‌టీ సమావేశంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
పన్ను ఎగవేతలు అరికట్టండి
నరసరావుపేట: జిల్లాలో పన్ను ఎగవేతలను అరికట్టాలని, చట్టప్రకారం ప్రభుత్వానికి కట్టాల్సిన ప్రతి రూపాయి వసూలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జీఎస్‌టీ సమన్వయ సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు పన్ను వసూళ్ల విషయంలో పన్నుల శాఖకు సహకరించాలన్నారు. శాఖల వారీగా వ్యాపారాలలో ఉన్న సంస్థల వివరాలు పన్నుల శాఖకు ఇవ్వాలన్నారు. ఆయా సంస్థలు సక్రమంగా పన్నులు చెల్లించడం ద్వారా మాత్రమే దీర్ఘకాలం వ్యాపారంలో కొనసాగ గలవని స్పష్టం చేయాలన్నారు. గుంటూరు వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ జాన్ స్టీవెన్ పాత్రో, డిప్యూటీ కమిషనర్ జి.మురళీకృష్ణ, ఎల్డీఎం రామ్ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెగా జాబ్‌మేళా సద్వినియోగం చేసుకోండి
సత్తెనపల్లిలోని మెయిన్‌రోడ్డులో గల డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల ఆరున నిర్వహించే మెగా జాబ్‌మేళాను విజయవంతం చేయాలని ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి తమ్మాజీరావు పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో మంగళవారం జాబ్‌మేళాకు చెందిన వాల్‌పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆవిష్కరించారు. పల్నాడు జిల్లా, పరిసర ప్రాంత యువతీయువకులు అందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనిలో సుమారు 30కి పైగా బహుళ జాతి కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. నెల జీతం విద్యార్హతను బట్టి సుమారు రూ.13 వేల నుంచి రూ.35 వేల వరకు ఉంటుందన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ చదివి 18–35ఏళ్ల మధ్య వయసు గల నిరుద్యోగులు ఉదయం 9– సాయంత్రం 4 గంటల మధ్య నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు.


