మచ్చే కదా అని వదిలేస్తే ముప్పే..!
సిబ్బందికి సహకరించాలి
సత్తెనపల్లి: శరీరంపై స్పర్శ లేని మచ్చలు, తెల్ల రాగి మచ్చలు ఉంటే జాగ్రత్త .. ఎందుకంటే ఆ మచ్చలతోనే ప్రమాదం పొంచి ఉంది. శరీరంపై ఎక్కడ మచ్చలు ఉన్నా మొహమాటం పడకుండా వైద్య సిబ్బందికి చూపించాలి. లేదంటే తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కింద చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వైద్యులకు తెలియజేయాలని చెబుతున్నారు. జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలనలో భాగంగా ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి సర్వే చేస్తున్నారు. సర్వేలో భాగంగా అనుమానిత మచ్చలు, తెలుపు, రాగి మచ్చలతోపాటు పొడలు శరీరంపై ఉంటే నిర్భయంగా ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందికి తెలియచేయాలని అధికారులు కోరుతున్నారు. జిల్లాలోని 28 మండలాల పరిధిలో 530 గ్రామ పంచాయతీలు, 13 పురపాలక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 26 అర్బన్ హెల్త్ సెంటర్లు పరిధిలో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తున్నారు. గత నెల 30న జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ జిల్లా అధికారిణి డాక్టర్ యు.మాధవీలతలు వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. దీంతో ప్రారంభమైన ఈ సర్వే ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆరు నెలలకు ఒకసారి చేస్తున్న సర్వేలో 2025 ఏప్రిల్ ఒకటి నుంచి 2026 జనవరి ఆఖరి వరకు జిల్లాలో 62 కేసులు నమోదయ్యాయి. వీటిలో 17 పీబీ (పాసివ్ బ్యాసిలరీ) కేసులు కాక 45 ఎంబీ(మల్టీబ్యాసిలరీ) కేసులు ఉన్నాయి. ఇవి కాక జిల్లాలో 77 కుష్ఠువ్యాధి కేసులు ఉండడంతో వారికి ఎండీటీ కోర్సుతో మందులు ఇచ్చి వైద్య సేవలు అందించడంతో కుష్ఠువ్యాధి నుంచి కోలుకొని యథాస్థితికి తీసుకు వచ్చారు.
వ్యాధి లక్షణాలు ఇవే...
● కాళ్లు, చేతులపై స్పర్శ జ్ఞానం లోపించడం
● ముఖంపై చర్మం నూనె రాసినట్లు నిగనిగలాడుతుంది
● ముక్కుదిబ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం
● చల్లని, వేడి వస్తువులను గుర్తించలేకపోవడం
● చేతుల నుంచి వస్తువులు జారిపోవడం
● వేళ్లు వంకర్లు తిరగడం, చర్మం పాలిపోవడం, రాగి రంగులోని స్పర్శ లేని మచ్చలు
● కుష్ఠు వ్యాధికి సంబంధించిన మచ్చలపై చెమట పట్టకపోవడం, కనుబొమ్మలు లేదా వెంట్రుకలు రాలిపోవడం
చికిత్స ఇలా ...
బహుళ ఔషధ చికిత్స (మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా కుష్ఠువ్యాధి పూర్తిగా నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రారంభ దశలో గుర్తించి సక్రమంగా చికిత్స చేయించుకుంటే కుష్ఠువ్యాధితో పాటు అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు. 6 నుంచి 12 నెలల పాటు ఎండీటీ మందులతో చికిత్స తీసుకుంటే కుష్ఠు పూర్తిగా నయం అవుతుంది. మందులతో చికిత్స తీసుకుంటే కుష్ఠువ్యాధి పూర్తిగా నయం అవుతుంది.
సర్వేలో వివరాలు నమోదు చేస్తూ..
సర్వేలో భాగంగా శరీరంపై మచ్చలు, అధిక మోతాదులో పొడలు ఉంటే సిబ్బంది వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అనుమానిత లక్షణాలున్న వ్యక్తిని పరిశీలించి కుష్ఠువ్యాధి అవునో కాదో నిర్ధారణ చేస్తారు. ఒకవేళ కుష్ఠువ్యాధిగా తెలితే సంబంధిత వ్యక్తి పేరు నమోదు చేసుకొని చికిత్స ప్రారంభిస్తారు. కుష్ఠువ్యాధి మైక్రో బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ వ్యాధి రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ప్రతి ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయని వైద్యాధికారులు చెబుతున్నారు.
జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఏఎన్‌ఎం, సూపర్‌వైజర్, ఆశా కార్యకర్తలు ఈ నెల 13 వ తేదీ వరకు ఇంటింటి సర్వే చేయనున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు, స్వయం సహాయక సంఘాలకు, మురికివాడల్లో ప్రజలకు, ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సర్వే చేయడానికి వస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందికి ప్రజలు సహకరించాలి. కుష్ఠువ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత భయపడాల్సిన పనిలేదు. ఎండీటీ మందు వాడితే వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది. శరీరంలో తెలుపు, రాగి మచ్చలను గుర్తించి అనుమానిత వ్యక్తుల పేర్లు నమోదు చేసి వైద్యాధికారులు దృష్టికి తీసుకువెళ్లి వారికి ట్రీట్‌మెంట్ ప్రారంభిస్తున్నాం.
–డాక్టర్ యు.మాధవీలత, జిల్లా కుష్ఠు,
ఎయిడ్స్, క్షయ నివారణాధికారిణి, పల్నాడు
ఇంటింటా కుష్ఠువ్యాధి నిర్ధారణ సర్వే
స్పర్శ లేని మచ్చలతో ప్రమాదం
మచ్చలుంటే చూపించాలంటున్న వైద్యులు
ఈ నెల 13 వరకు కొనసాగనున్న సర్వే
మచ్చే కదా అని వదిలేస్తే ముప్పే..!


