నేటి నుంచి జాతీయ నాటికల పండగ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జాతీయ నాటికల పండగ

Apr 3 2026 7:32 AM | Updated on Apr 3 2026 7:32 AM

నేటి నుంచి జాతీయ నాటికల పండగ ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల ధర్నా సచివాలయ సిబ్బంది సస్పెన్షన్‌ 16న జెడ్పీ సర్వసభ్య సమావేశం

యడ్లపాడు: యడ్లపాడు గడ్డపై శుక్రవారం నుంచి 23వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం కానున్నాయి. కళాభిమానులను అలరించేందుకు ముస్తాబయ్యాయి. తొలిరోజే వైవిధ్య భరితమైన ఇతివృత్తాలతో కూడిన నాటికలు రంగస్థలంపై మెరవనున్నాయి. శుక్రవారం రాత్రి 7 గంటలకు వీరన్నపాలెం(కళానికేతన్‌) వారి ‘దీపం కింద చీకటి’తో మొదలయ్యే ఈ కళాయజ్ఞం, ఆపై ప్రముఖ సినీ నటులు ఉప్పులూరి సుబ్బరాయశర్మకు అందించే ‘సుందరయ్య–2026’ కళా పురస్కార ప్రదానోత్సవంతో మరింత శోభాయమానం కానుంది. అనంతరం విశాఖపట్నం (చైతన్య కళాస్రవంతి) వారి ‘(అ) సత్యం’ నాటిక సమాజంలోని ముసుగులను ప్రశ్నించనుంది. అన్నిటికంటే ముఖ్యంగా, కాకినాడ(బీవీకే క్రియేషన్స్‌) బృందం ప్రదర్శించే ‘కన్నీటికి విలువెంత’ నాటికలో ఏడుగురు మహిళా కళాకారిణులు ప్రధాన పాత్రలు పోషించడం నాటక చరిత్రలోనే రికార్డుగా నిలువనుంది.

లక్ష్మీపురం: ఏపీఎస్‌ఆర్టీసీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గుంటూరు రీజనల్‌ మేనేజర్‌ కార్యాలయం వద్ద ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగులు గురువారం ధర్నా నిర్వహించారు. పి.శేషగిరిరావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ కె.గంగాధరరావు హాజరయ్యారు. నాయకులు మాట్లాడుతూ 2020 జనవరి 1 నుంచి నేటి వరకు రిటైర్డ్‌ అయిన వారికి లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, గ్రాడ్యూటీ ఇవ్వాలన్నారు. అనంతపురం, రాజమండ్రిలలో రిఫరల్‌ హాస్పటల్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం రీజనల్‌ మేనేజర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.నాగేశ్వరరావు, జి.వెంకటస్వామి, సీహెచ్‌ వెంకటేశ్వర్లు, రామచంద్రరావు, తెనాలి నుంచి సుబ్రహ్మణ్యం, గద్దె రవీంద్ర, శంకర రావు తదితరులు పాల్గొన్నారు.

నాదెండ్ల: పౌర సేవల్లో తాత్సారం చేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు సచివాలయ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడింది. నాదెండ్ల ఒకటో సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తాటిబోయిన ఈశ్వరయాదవ్‌, గ్రామ సర్వేయర్‌గా పనిచేస్తున్న వాసిమళ్ల సుందర్‌పాల్‌, సంకురాత్రిపాడు వీఆర్వో ఇత్తెల నాగజ్యోతి, డిజిటల్‌ అసిస్టెంట్‌ సయ్యద్‌ అహ్మదుల్లాలను సస్పెండ్‌ చేస్తూ గురువారం జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. స్వర్ణ గ్రామ సచివాలయాల్లో వివిధ పనులపై వచ్చే స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తూ సకాలంలో పనులు చేయటం లేదని సస్పెండైన సిబ్బందిపై ఆరోపణలున్నాయి. ఫోన్‌కాల్‌ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరించే ఐవీఆర్‌ఎస్‌ సర్వే ఆధారంగా వీరిపై ఫిర్యాదులు అందాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించి సస్పెన్షన్‌ వేటు వేశారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 16న నిర్వహించేందుకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గురువారం షెడ్యూల్‌ విడుదల చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన జరగనున్న సమావేశంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, వైద్య ఆరోగ్యశాఖ, ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌, విద్య, సమగ్ర శిక్ష, వయోజన విద్యాశాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, డ్వామా, గృహ నిర్మాణ, పౌర సరఫరాల శాఖ, పరిశ్రమల శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏ శాఖల వారీగా ప్రగతిపై చర్చించనున్నారు. మూడు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, ఆయా శాఖల అధికారులకు ఈ మేరకు సమాచారాన్ని పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement