యువతి మృతి వెనుక మిస్టరీని ఛేదించిన పోలీసులు
మాచర్ల: యువకుడిని ప్రేమించినందుకు యువతిని కన్న తల్లిదండ్రులే హత్య చేశారని సమాచారం. వివరాలు ఇవీ.. మాచర్ల పట్టణంలోని యాదవ వార్డుకు చెందిన కామనబోయిన చౌడేశ్వరి మండలంలోని జమ్మలమడకలోని నాగరాజు ప్రేమించుకున్నారు. దీనికి పెద్దలు ఒప్పుకోరని ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో చౌడేశ్వరి తండ్రి చంద్ర శ్రీను పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. తమ కుమార్తె అదృశ్యమైనా పోలీసులు పట్టించుకోవటం లేదని భార్యతో కలిసి ఆందోళన చేశాడు. కుమార్తె ఆచూకీ తెలుసుకొని పోలీసులు మాచర్లకు మార్చి 15వ తేదీన తీసుకొచ్చారు. ఆ రోజు ఇరు వైపులా పెద్దలను పిలిచించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇరువర్గాలు చర్చించుకొని ఓ నిర్ణయం తీసుకోవాలని వారిని ఇళ్లకు పంపారు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. కుమార్తె ప్రేమ వ్యవహారం ఇష్టం లేని తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా కుమార్తె మాట వినటం లేదని భావించాడు. మార్చి 18వ తేదీన చౌడేశ్వరి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారమిచ్చాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం తరువాత పోలీసులకు అనుమానం వచ్చినట్లు తెలిసింది. ఇది హత్యగా పోలీసులు భావించారు. దీనికి కారకులు తండ్రి చంద్ర శ్రీను, తల్లి, మేనత్త, మేనమామ, మరొకరు అని తేల్చినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో విచారణ నిమిత్తం ఐదుగురిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. ఇప్పటికి ఆత్మహత్య కేసుగానే నమోదు చేసినా... పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయని సమాచారం. హత్య కేసుగా మారే అవకాశం ఉందని తెలిసింది. చౌడేశ్వరిని, నాగరాజును పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చేటప్పటికే వారు ‘వివాహం చేసుకున్నామని, తాము మేజర్లని చెప్పినట్లు’ సమాచారం. ఎక్కడ పెళ్లి చేసుకున్నారో వివరాలు చెప్పి, ఆధారాలను కూడా చూపించారని తెలిసింది. అయినప్పటికీ ఇళ్లకు పోలీసులు పంపించి వేశారు. ఈ నేపథ్యంలో చౌడేశ్వరిని సొంత కుటుంబ సభ్యులే పరువు హత్య చేశారని సమాచారం.


