కుష్ఠువ్యాధి నిర్మూలనకు సహకరించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్ల
నరసరావుపేట: జిల్లాలో కుష్ఠువ్యాధి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్ల పేర్కొన్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు నిర్వహించే అవగాహన కార్యక్రమానికి చెందిన బ్రోచర్‌ను మంగళవారం ఆమె ఆవిష్కరించారు. జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఈ పక్షోత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా కాలనీలు, విద్యాలయాలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో లెప్రసీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి, డెప్యూటీ జిల్లా కుష్ఠు, టీబీ, ఎయిడ్స్ నిర్మూలన అధికారి డాక్టర్ ప్రభాకరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : గుంటూరు జిల్లా డీఆర్‌డీఏ పీడీగా పనిచేసిన టీవీ విజయలక్ష్మీని నెల రోజుల కిందట సెర్ప్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా ఆమెను ఏలూరు డీఆర్‌డీఏ పీడీగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తాడేపల్లి రూరల్ : ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు తాడేపల్లి పోలీసులకు మంగళవారం సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిన ఎస్‌ఐ అపర్ణ కృష్ణానది నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉండవచ్చని, ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెంది ఉండవచ్చని ఎస్‌ఐ తెలిపారు. మృతుడి శరీరంపై నలుపు నిలువు చారలు కలిగిన చొక్కా, సిమెంట్ కలర్ ఫ్యాంటు ఉందని, చేతికి దారాలు ఉన్నాయని, ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే తాడేపల్లి పోలీసులను సంప్రదించాలని కోరారు.
గుంటూరు ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల సాధన కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) చేపట్టిన పోరాటాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరులో పోరాట కార్యక్రమ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే పీఆర్సీ కమిటీ ఏర్పాటుతోపాటు సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా రోడ్‌మ్యాప్ ప్రకటించి, రూ.34 వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఆ ఊసే లేదన్నారు. అందుకే దశల వారీ ఉద్యమానికి ఎస్టీయూ పిలుపు ఇచ్చిందన్నారు. ఈనెల 30న మండల స్థాయిలో తహసీల్దార్లకు మెమొరాండం సమర్పించే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎస్టీయూ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ఈ నెల 30, 31, ఫిబ్రవరి 1న గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా జనవరి 29 నుంచి వ్యవసాయ ప్రదర్శన, వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగంలో పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సమస్యలపై జాతీయ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. నాలుగు రోజులు పాటు 14 అంశాలపై సదస్సులు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పాల్గొన్నారు.


