దళితులపై దమనకాండ దారుణం
మందా సాల్మన్ కుటుంబాన్ని ఆదుకోవాలి టీడీపీ నేతలు దమనకాండ ఆపకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం వైఎస్సార్ సీపీ ఎస్‌సి సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల సుందరరావు
మాచర్ల: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టాక దళితులపై దాడులు, దౌర్జన్యాలు, గ్రామ బహిష్కరణలు ఎక్కువైపోయాయని, ఆఖరికి వారిని హత్యలు కూడా చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎస్‌సి సెల్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల సుందరరావులు అన్నారు. మంగళవారం మాచర్లలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉంటున్న దళితులపై దాడులు, దళిత మహిళలపై లైంగికదాడులు ఎక్కువయ్యాయన్నారు. మొదటి నుంచి దళితులు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారనే భావనతోనే కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగంతో వేధింపులకు గురిచేస్తుందన్నారు. ఈక్రమంలో ఆదోనిలో గోవిందమ్మ, అద్దంకిలో చింతల శ్రీను, పిన్నెల్లిలో మందా సాల్మన్‌లపై దాడులు జరిపారన్నారు. వారిలో సాల్మన్‌ను హతమార్చారన్నారు. నంద్యాల ప్రాంతంలో దళిత మహిళ పై లైంగికదాడి చేశారన్నారు. అనేక గ్రామాల్లో సాంఘిక బహిష్కరణ చేస్తూ దళితులను చిన్నచూపు చూస్తూ భారత రాజ్యాంగం కాదని తమ సొంత రాజ్యాంగాన్ని టీడీపీ ప్రభుత్వం అమలు చేసి దళితులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేయటం దారుణమన్నారు.
– రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎస్సీ అయివుండి కూడా దళితుల పై జరుగుతున్న దాడులు అరికట్టలేకపోవటం బాధాకరమన్నారు. దళితుల పై దాడులు అరికట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించి రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నించాలని, జిల్లాలో జరిగిస్తున్న దమన కాండను ఆపివేయాలన్నారు. విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు మందా సంతోష్, వేల్పుల గురవయ్య, ఎస్‌సి సెల్ నేత కందుకూరి మధు, జిల్లా నాయకులు కొమ్ము బొంగురు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పవన్, కోటా రాజేష్ తదితరులున్నారు.


