జిల్లా కోర్టులో గణతంత్ర వేడుకలు
గుంటూరు లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన గణతంత్ర వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగలశెట్టి శివసూర్యనారాయణ, జనరల్ సెక్రెటరీ మోతుకూరి శ్రీనివాసరావు, ట్రెజరర్ గూడూరి అశోక్‌కుమార్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు.
నగరంపాలెం: గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందికి ఐజీ మిఠాయిలు అందించారు. కార్యక్రమంలో కార్యాలయపు మేనేజర్ హిమంత్‌రావు, సీఐ (ఎల్/ఓ) వినోద్‌కుమార్, వెల్ఫేర్ ఆర్‌ఐ సురేష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెనాలి: తెనాలి రూరల్ మండలం నంది వెలుగు గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల వెంకట నాగపవన్ కుమార్ ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో అవార్డును అందుకున్నారు. నందివెలుగు గ్రామ అభివృద్ధికి చేసిన కృషికిగాను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. పురస్కార స్వీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న నాగపవన్‌కుమార్, సతీసమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాలలో అవార్డు స్వీకరించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతా నగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం హంసవాహన సేవ, పెరుమాళ్ల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం త్రిదండి చిన్నజీయర్‌స్వామి, అహోబిల రామానుజ జీయర్‌స్వామి, దేవనాథ రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో గరుడ వాహనంపై విజయ కీలాద్రి గిరి పరిక్రమణను వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
పిడుగురాళ్ల: మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహాస్వామి 70వ కల్యాణ మహోత్సవం, తిరునాళ్ల కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచి స్వామి వారికి పంచామృతాభిషేకాలు చేశారు. ప్రత్యేక అలంకరణను ఆలయ అధ్యక్షుడు హంసావత్తు రామునాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మంగళవారం ఉదయం స్వామిని ఉగ్రనరసింహునిగా అలకరిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్త బృందంచే పౌలు సేవ కార్యక్రమం నిర్వహించనున్నారు.
జిల్లా కోర్టులో గణతంత్ర వేడుకలు


