యువకుడి అవయవాల దానంతో ఆరుగురికి పునర్జన్మ
గుంటూరు మెడికల్: బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాల దానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగులు నిండాయి. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు.. గుంటూరు జిల్లా తెనాలి మండలం పినపాడు గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ కుమారుడైన ఇంజినీరింగ్ విద్యార్థి పెరుగు అమర్ బాబు(22) నిడుముక్కల శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తెనాలిలో చికిత్స కోసం చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌కు బంధువులు తీసుకొచ్చారు. అమర్‌బాబు చికిత్స పొందుతూ సోమవారం బ్రెయిన్ డెడ్ అయ్యాడు. జీవన్‌దాన్ కో ఆర్డినేటర్లు అవగాహన కల్పించడంతో అవయవాల దానానికి బాధిత కుటుంబసభ్యులు అంగీకరించారు. అవయవాలను ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ వరకు ప్రత్యేక గ్రీన్ చానల్ ద్వారా ‘గుండె’ను తిరుపతికి తరలించారు. కళ్లను తాడిగడప ఎల్‌వీ ప్రసాద్ కంటి హాస్పిటల్‌కు తరలించారు. లివర్, కిడ్నీలు గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌లోనే తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి అమర్చి నూతన జీవితాలను ప్రసాదించారు. అమర్ బాబు తల్లి కోటేశ్వరమ్మను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి పరామర్శించారు. హాస్పిటల్ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత, ఏపీ బిజినెస్ హెడ్, ట్రాన్స్‌ప్లాంట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ యలవర్తి కార్తిక్‌చౌదరి, జీవన్‌దాన్ కో ఆర్డినేటర్‌లు కొడాలి అనూష, అఖిలేష్ చింతమనేని తదితరులు కూడా కోటేశ్వరమ్మను అభినందించారు.
యువకుడి అవయవాల దానంతో ఆరుగురికి పునర్జన్మ


