రైతును ముంచుతున్న నకిలీలు
తెలంగాణ నుంచి భారీస్థాయిలో డంప్ చేస్తున్న డీలర్లు అధిక లాభాలకు ఆశపడి రైతులకు నకిలీ మందులను అంటగడుతున్న దుకాణదారులు తీవ్రంగా నష్టపోతున్న రైతులు జిల్లా వ్యాప్తంగా వరుసగా పట్టుబడుతున్న పురుగు మందులు బిల్లులులేని పురుగు మందులే అంటున్న వ్యవసాయ శాఖ అధికారులు
మార్కెట్‌లో కుప్పలు తెప్పలుగా నకిలీ పురుగుమందులు
స్కాన్ చేసి నిర్ధారించుకోవచ్చు
బిల్లులు లేని మందులే
సాక్షి, నరసరావుపేట: గురజాల మండలానికి చెందిన రైతులు రెండు నెలల క్రితం స్థానిక వ్యాపారి వద్ద పురుగు మందులు కొనుగోలు చేశారు. అవి వాడిన పంటలలో ఏ మాత్రం చీడపీడల నివారణ జరగకపోవడంతో వ్యాపారిని నిలదీయగా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా సదరు వ్యాపారుల ఇళ్లలో సుమారు రూ.3 లక్షల విలువైన నకిలీ పురుగుమందులను పోలీసులు గుర్తించారు. విచారణలో తనకు తెలంగాణకు చెందిన ఓ డీలర్ ద్వారా ఎటువంటి బిల్లులు లేని పురుగు మందులు సరఫరా చేస్తారని, వీటి అమ్మకం ద్వారా అధిక లాభాలా వస్తాయని చెప్పుకొచ్చాడు.
ఇలాంటి ఘటనలు పల్నాడు జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. వీటిని కొనుగోలు చేసిన రైతులు ఆర్థికంగా, దిగుబడి పరంగా తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్‌లో కుప్పలు తెప్పలుగా వస్తున్న పురుగు మందుల్లో ఏవి నకిలీవో, ఏవి అసలైనవో గుర్తించడం కష్టమవుతోంది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు డీలర్లు, వ్యాపారులు రైతులను నకిలీలతో నిలువునా మోసం చేస్తున్నారు. బిల్లులు లేకపోవడంతో రైతులు సదరు మందుల కంపెనీపై న్యాయపరమైన పోరాటానికి సైతం వీలులేకుండా పోతోంది.
మార్కెట్‌లో నకిలీ పురుగు మందులు విపరీతంగా అమ్ముతున్నారు. ముఖ్యంగా వరి, పత్తి రైతులు అధికంగా వినియోగించే దోమ, గులాబి రంగు పురుగు నివారణ మందులకు నకిలీలు సృష్టించి ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. హైదరాబాద్ నగర శివారుల్లో బయో ఉత్పత్తులు తయారు చేసే కొన్ని కంపెనీలు వీటి మాటున నకిలీ పురుగు మందులు తయారు చేసి మార్కెట్‌లోకి వదులుతున్నట్టు సమాచారం. ప్రముఖ కంపెనీల మాదిరిగా డబ్బాలు, లేబుళ్లు తయారు చేస్తుండటంతో రైతులు తేడా కనుక్కోలేక పోతున్నారు. మరోవైపు చాలా రోజులుగా తాము కొంటున్న దుకాణాలలోనే నకిలీలు లభిస్తుండటంతో వ్యాపారులపై ఉన్న నమ్మకంతో రైతులకు అనుమానం సైతం కలగడం లేదు. ఈ నకిలీ ముఠాల టార్గెట్ మారుమూల పట్టణాలు కావడంతో వీరి పని మరింత సులువవుతోంది.
ప్రముఖ కంపెనీల పురుగుమందులు కొనుగోలు చేసేటప్పుడు మందు డబ్బాలపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను యాప్ ద్వారా స్కాన్ చేస్తే అది అసలైనదా లేదా నకిలీదా అని గుర్తించే అవకాశం ఉంటుంది. రైతులు ఆయా కంపెనీ యాప్ లేదా గూగుల్ లెన్స్ వంటి వాటి ద్వారా చెక్‌చేసుకోవచ్చు. అయితే గ్రామీణ రైతులందరికి ఈ పరిజ్ఞానంపై అవగాహన లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. నకిలీ డబ్బాలపైనా క్యూఆర్ కోడ్ ఉంటుంది, అయితే దాన్ని స్కాన్ చేస్తే కంపెనీ వివరాలు కనిపించవు.
జిల్లాలో ఇటీవల కాలంలో గురజాల, పిడుగురాళ్ల, నరసరావుపేటలలో పురుగు మందులను ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల్లో తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నాం. వాటి శాంపిల్స్ సేకరించి నకిలీవి కాదని నిర్ధారించుకున్న తరువాత సంబంధిత బిల్లులను చూసి వ్యాపారులకు అప్పగించాం. నరసరావుపేటలో పట్టుబడిన వాటిని ఎవరూ ఇప్పటివరకు క్‌లైమ్ చేసుకోలేదు. శాంపిల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇవన్నీ ఎక్కవ వరకు రైతులు బుక్ చేసుకున్నవి, చిన్న చిన్న వ్యాపారులు బుక్ చేసుకున్న మందులే ఉంటున్నాయి. నకిలీ మందులు గుర్తించలేదు. దుకాణాలు, కార్గో సర్వీసులపై నిరంతరం నిఘా ఉంచాం. నకిలీ మందులు సమాచారం తెలిస్తే ఫిర్యాదు చేయవచ్చు.
– జగ్గారావు,
పల్నాడు జిల్లా వ్యవసాయశాఖ అధికారి
రైతును ముంచుతున్న నకిలీలు
రైతును ముంచుతున్న నకిలీలు


