రాష్ట్రంలో పల్నాడు ముందుండాలి
సత్తెనపల్లి: విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాల్లో రాష్ట్రంలో పల్నాడు జిల్లా ముందుండాలని జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు అన్నారు. సత్తెనపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, టీడబ్ల్యూఆర్‌ఎస్, ఏపీఎంఎస్, తదితర ప్రభుత్వ యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు–1,2, సీఆర్పీలు, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రామారావు మాట్లాడుతూ గత సంవత్సరం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో 598, 596 మార్కులతో పల్నాడు జిల్లా ప్రభుత్వ పాఠశాలలు ముందున్నాయని, ఈ ఏడాది కూడా దానికి తగ్గకుండా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంయుక్తంగా కలసి కష్టపడి పనిచేసి పదో తరగతి ఫలితాల్లో గర్వపడే విధంగా కృషి చేయాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు జరుగుతున్న 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలుపరచాలన్నారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు జరుగుతున్న 75 రోజుల జీఎఫ్‌ఎల్‌ఎన్‌ను పకడ్బందీగా అమలు పరచాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాన్ని పాఠశాలల్లోని విద్యార్థులందరూ భుజించే విధంగా కృషి చేయాలన్నారు. కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమ వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వారికి వడ్డించే భోజనం విషయంలో, రోజువారి అమలవుతున్న మెనూ విషయంలో, నాణ్యతలో రాజీ పడవద్దన్నారు. సమావేశంలో సత్తెనపల్లి ఉప విద్యాశాఖ అధికారి ఏసుబాబు, సమగ్ర శిక్ష ఏఎంఓ పూర్ణచంద్రరావు, సమగ్ర శిక్ష కార్యాలయ సిబ్బంది పద్మారావు, పాలేటి శ్రీనివాసరావు, నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారులు–1,2, వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు, ఏఈలు, పాల్గొన్నారు.


