ఆపస్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఉపాధ్యాయ సంఘ (ఆపస్) నూతన సంవత్సర కేలండర్, డైరీని పాఠశాల విద్య ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉన్న ఆర్జేడీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆపస్ రాష్ట్ర మహిళా కన్వీనర్ పి.పద్మ, ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఎ.బాలచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీలో గురువారం జరగాల్సిన స్థాయీ సంఘ సమావేశాలతో పాటు సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. సీఎం చంద్రబాబు గుంటూరు నగరానికి వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు ఓ ప్రకటనలో తెలిపారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్సిక్ మహా సంఘం (ఏబీఆర్‌ఎస్‌ఎం) ఆంధ్రప్రదేశ్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో దాదాపు ఐదు వేల అధ్యాపకుల పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఏబీఆర్‌ఎస్‌ఎం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ వై.వి.రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డి.ఎస్.వి.ఎస్ బాలసుబ్రహ్మణ్యం కోరారు. అనంతరం ప్రొఫెసర్ మధుమూర్తి మాట్లాడుతూ కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఉన్నందువల్ల అధ్యాపక పోస్టుల భర్తీ ఆలస్యం అవుతుందని, వీలైనంత తొందరలో భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ సహ సంఘటన కార్యదర్శి గుంతా లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ రామచంద్రన్, డాక్టర్ వాణి, డాక్టర్ గంగరాజు, డాక్టర్ బాల మురళి, తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు రూరల్: గుంటూరులోని నల్లపాడు రోడ్డు రెడ్డికళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన సరస్ మేళా ఏర్పాట్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి ఇది ఒక వేదికని తెలిపారు. ఇది మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడుతుందన్నారు. ఈ అఖిల భారత డ్వాక్రాబజార్ సరస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు గురువారం ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శన విక్రయాలు జరుగుతాయన్నారు. గుంటూరులో ఈ మేళా 12 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాటు చేయబడిందన్నారు.300 షాపులు ఉంటాయని, వాటిలో 65 షాపులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉత్పత్తులను ప్రదర్శన విక్రయాలు చేస్తారన్నారు.
ఆపస్ నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ


