అక్షరాలకు పునఃప్రాణప్రతిష్ట చేసిన దోణప్ప
పుస్తక మహోత్సవంలో డాక్టర్ గుజ్జర్లమూడి కృపాచారి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): తెలుగు అక్షరాలకు పునఃప్రాణప్రతిష్ట చేసిన ఘనత సాహితీవేత్త తూమాటి దోణప్పకే దక్కుతుందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ప్రముఖ సాహితీవేత్త ఆచార్య తూమాటి దోణప్ప శతజయంతి సభను బీవీ పట్టాభిరామ్ సాహిత్యవేదికపై బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సభలో దోణప్ప గురించి రాసిన ‘గురు శిరోమణి’ పుస్తక పునర్ముద్రణను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య కృపాచారి మాట్లాడుతూ.. దోణప్ప శిష్యవాత్సల్యంతో ఎందరో అధ్యాపకులను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఆయన తెలుగు సాహిత్యానికి అందించిన సేవలను గుర్తుచేస్తూ ఆ అంశా ల్లోని ప్రత్యేకతలను వివరించారు. సాహితీవేత్త డాక్టర్ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ.. దోణప్ప కఠినమైన భాషాశాస్త్ర పాఠాలను కూడా సరళంగా, హృద్యంగా విద్యార్థులకు అర్థమయ్యేలా, స్ఫూర్తికలిగించేలా బోధించారన్నారు. తెలుగు సాహిత్యంపై, భాషాశాస్త్రం ఆయనకున్నపట్టు ఆదర్శప్రాయమైనదని వివరించారు. సాహితీవేత్త ఆచార్య తమ్మారెడ్డి నిర్మల, ఆచార్య డాక్టర్ షేక్ మస్తాన్ మాట్లాడుతూ.. దోణప్ప సాహితీ శైలిని వివరించారు. విజయవాడ పుస్తకమహోత్సవ సంఘం అధ్యక్షుడు టి.మనోహర్ నాయుడు స్వాగతం పలికిన ఈ సభలో దోణప్ప కుమారుడు తూమాటి సుధాకర్, కుమార్తె సుజాత సభలో పాల్గొన్నారు.
‘చుక్క పొడుపు’ నవల ఆవిష్కరణ
సాహిత్యంలో శక్తివంతమైన రచనలు సమాజాన్ని చైతన్యవంతం చేయటంలో కీలకభూమికను పోషిస్తాయని ప్రముఖ కవి ఖాదర్‌మొహిద్దీన్ అన్నారు. పుస్తక మహోత్సవ వేదికపై రచయిత్రి నల్లూరి రుక్మిణి రాసిన ‘చుక్క పొడుపు’ నవలను ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. సమాజమనే చట్రంలో కుటుంబం, వ్యక్తి బంధితులై ఉంటారన్నారు. వీటిని రాజ్యం నియంత్రిస్తుందని వివరించారు. ఈ నియంత్రణను లెక్క చేయక, సామాజిక చట్రాల పరిధులను అధిగమించేవారి చరిత్రల చిత్రణకు సమాజాన్ని మార్చగల శక్తి ఉంటుందన్నారు. అటువంటి చిత్రణ ‘చుక్క పొడుపు’ నవలలో కనిపిస్తోందన్నారు. సాహితీవేత్త గుంటూరు లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ.. తన అన్ని రచనల్లోనూ సజీవమైన భావాలను పలికించడంలో నల్లూరి రుక్మిణిది అందెవేసిన చెయ్యి అన్నారు. రచయిత అరసవెల్లి కృష్ణ నిర్వహించిన ఈ సభలో రచయిత్రి నల్లూరి రుక్మిణి పాల్గొన్నారు. కవిగా, కథా రచయితగా, నాటక రచయితగా స్మైల్ తెలుగు పాఠకులపై తనదైన ముద్ర వేశారని వక్తలు కొనియాడారు. పుస్తక మహోత్సవం ప్రాంగణంలో స్మైల్ రచనలపై పరిశోధనాగ్రంథ ఆవిష్కరణ సభ జరిగింది.


