తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడి
తీవ్రగాయాలు
అచ్చంపేట: తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడిచేసిన ఘటన మంగళవారం అచ్చంపేటలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే...అచ్చంపేటలోని చామర్రు రోడ్డులో నివాసముంటున్న కుమారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు షేక్ బాషా, చిన్న కుమారుడు షేక్ సైదావలి. ఆమె భర్త 15 సంవత్సరాల కిందట మృతి చెందాడు. పెద్ద కుమారుడు బాషా మద్యానికి బానిస కావడంతో భార్య, పిల్లలు వదలి వెళ్లారు. అప్పటి నుంచి తల్లి వద్దే ఉంటున్నాడు. చిన్న కుమారుడు సైదావలి ఇంటి ముందే వెల్డింగ్ షాపు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో బాషా మద్యం తాగి తల్లితో ఘర్షణ పడుతున్నాడు. తమ్ముడు సైదావలి మందలించే ప్రయత్నం చేశాడు. ఆగ్రహించిన బాషా మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి ముందు నిద్రిస్తున్న సైదావలిపై గొడ్డలితో దాడిచేశాడు. అతని తల, ముక్కుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్‌లో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట పోలీసులు బాషాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
అవకాయలో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు
డీఎస్‌ఓ నరసింహారెడ్డి
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర పర్యాటక ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ భవానీ ఐలాండ్‌లో నిర్వహిస్తున్న అవకాయ అమరావతి సినిమా, సంస్కృతి, సాహిత్య ఉత్సవాలలో భాగంగా మార్షల్ ఆర్ట్స్ వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా కరాటే, టైక్వాండో, జూడో వుషు, కుంగ్‌ఫూ ప్రదర్శనలను 9, 10 తేదీలలో నిర్వహిస్తారని వివరించారు. ఆయా విభాగాలలో అనుభవం ఉన్న అకాడమీలు, క్లబ్‌లు, కోచ్‌లు వర్క్‌షాప్ నిర్వహణ, శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 7వ తేదీలోపు తమ వివరాలతో సతైనపల్లిరోడ్డు స్టేడియంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో సంప్రదించాలని కోరారు.
జ్వర లక్షణాలతో విద్యార్థిని మృతి
ముప్పాళ్ల:మండలంలోని గోళ్లపాడు కేజీబీవీ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని జ్వర లక్షణాలతో బాధపడుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. పిడుగురాళ్లకు చెందిన ఓ బాలిక కేజీబీవీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. క్రిస్మస్ పండుగ సెలవుల్లో భాగంగా ఇంటికి వెళ్లి 2వ తేదీన పాఠశాలకు వచ్చింది. తీవ్ర జ్వరం రావటంతో పిడుగురాళ్లలోని తల్లిదండ్రులకు కబురు పంపగా ఇంటికి తీసుకెళ్లారు. మరలా ఈనెల 4వ తేదీన పాఠశాలకు రాగా సాయంత్రానికి జ్వరం రావటంతో తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపించారు. పిడుగురాళ్లలోని ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ తగ్గక పోవటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5వ తేదీ రాత్రి మృతి చెందింది.


