పంచాయతీ వ్యవస్థకు చంద్రబాబు తూట్లు
నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ జనరల్ సెక్రటరీ పడాల చక్రారెడ్డి మండిపడ్డారు. అత్యధికంగా గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన వారికి గ్రామ సర్పంచ్‌లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అవకాశం కల్పించిందన్నారు. అలాంటి వారిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి కనీసం జీతాలు కూడా ఇవ్వడంలేదని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు జీతాలు మంజూరు చేయకపోవడం దారుణమని తెలిపారు. సర్పంచ్‌లకు జీతాలు వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో గవర్నర్ ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
సత్తెనపల్లి క్లబ్‌పై పోలీసుల దాడి
సత్తెనపల్లి: సత్తెనపల్లిలోని రిక్రియేషన్ క్లబ్‌పై పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 46 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,05,370లు నగదు, 37 సెల్‌ఫోన్లు, 11 వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దాడిలో పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు, పట్టణ ఎస్సై పి.పవన్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుద్ఘాతానికి కౌలు రైతు మృతి
రెంటచింతల: మండలంలోని పాలువాయిగేటు గ్రామంలో మంగళవారం విద్యుద్ఘాతానికి గురై కౌలు రైతు నాగళ్ల సాంబశివరావు(62) మృతి చెందాడు. ఆయన సుమారు 3.5 ఎకరాలు మాగాణి భూమి కౌలుకు తీసుకుని ఇటీవల వరి పంట సాగుచేశాడు. వరి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి బోరు స్విచ్ ఆన్ చేసే ప్రయత్నంలో విద్యుత్ తీగలు తగలడంతో అక్కడకక్కడే మృతిచెందాడు. పూర్తి ఆరోగ్యంతో తమ కళ్లె ఎదుటే తిరుగుతున్న ఆయన విద్యుద్ఘాతానికి గురై అకాల మరణం చెందటంతో గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య అనుసూయమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ మేరకు కేసు పరిశీలిస్తున్నారు.
పంచాయతీ వ్యవస్థకు చంద్రబాబు తూట్లు


