తెనాలిలో టీడీపీని అంతం చేసే కుట్ర | - | Sakshi
Sakshi News home page

తెనాలిలో టీడీపీని అంతం చేసే కుట్ర

Jan 7 2026 7:49 AM | Updated on Jan 7 2026 7:49 AM

తెనాలిలో టీడీపీని అంతం చేసే కుట్ర

తెనాలిలో టీడీపీని అంతం చేసే కుట్ర

● రెండున్నర గంటల హై డ్రామా తర్వాత టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి టీడీపీ శ్రేణులను అక్కడి నుంచి పంపించి వేశారు. టీడీపీ నాయకులు రావి కృష్ణమోహన్‌ (చిన్ని), కొల్లూరు శ్రీధర్‌, తాతా శ్రీను, కె.హరి కిషోర్‌, డాక్టర్‌ వేమూరి శేషగిరిరావు, అత్తోట శరత్‌, దుప్పలపూడి శ్యామ్‌, మల్లవరపు విజయ్‌ కుమార్‌, మునగాల నరసింహ, తోట లక్ష్మయ్య, అన్నం పిన్నారావు, పరుచూరి రమ్య, కొండ రమాదేవి, భావన సహా పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫ్లెక్సీలను తొలగించేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్న టీడీపీ కౌన్సిలర్లు, నేతలు నల్ల రిబ్బన్లు ధరించి బైఠాయింపు అధికారులు, టీడీపీ కార్యకర్తల నడుమ తోపులాట

టీడీపీ టార్గెట్‌గా మంత్రి మనోహర్‌ పనిచేస్తున్నారు..

మంత్రి నాదెండ్ల మనోహర్‌పై టీడీపీ శ్రేణుల ఆగ్రహం

తెనాలి టౌన్‌: మున్సిపల్‌ అధికారులు పోలీసుల సాయంతో పట్టణ వహాబ్‌చౌక్‌లో ఫ్లెక్సీల తొలగింపులో హైడ్రామా నెలకొంది. తొలగించిన ఫ్లెక్సీని టీడీపీ నాయకులు తిరిగి నిలబెట్టటమే కాకుండా మరో ఫ్లెక్సీని తీయకుండా అడ్డుకుని, అధికారులపై మండిపడ్డారు. నల్లబ్యాడ్జిలతో ఫ్లెక్సీ ఎదుట కూర్చొని నిరసన తెలియజేశారు. కూటమి ధర్మం వీడి మంత్రి మనోహర్‌ తమ పార్టీని టార్గెట్‌ చేశారంటూ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలో టీడీపీని చంపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చేసేదిలేక అధికారులు, పోలీసులు వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలి వహాబ్‌చౌక్‌లోని డివైడర్‌కు రెండు వైపులా టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల తొలగింపునకు మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ సిటీప్లానర్‌ వాణి, తన సిబ్బందితో ఉదయం 11 గంటలకు అక్కడకు చేరుకున్నారు. వహాబ్‌ చౌక్‌లో డివైడర్‌కు పడమరవైపున్న ఫ్లెక్సీని పొక్లెయిన్‌తో తొలగించారు. డివైడర్‌కు మరోవైపు మున్సిపల్‌ కౌన్సిలర్‌, టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ పసుపులేటి త్రిమూర్తి కార్యాలయం ఎదుటగల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నంలో ఉండగా, కౌన్సిలర్‌ పసుపులేటి త్రిమూర్తి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్‌ ఖుద్దూస్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను అడ్డుకున్నారు. నల్లరిబ్బన్లు ధరించి ఫ్లెక్సీ ఎదుట కూర్చుని నిరసన తెలిపారు.

టీడీపీ శ్రేణులకు అధికారుల మధ్య తోపులాట

జనం రద్దీగా ఉండే సమయంలో మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పోలీసులతో వచ్చి ఫ్లెక్సీల తొలగింపుకు పూనుకోవటం ఏమిటని ప్రశించారు. ఎవరి ప్రోద్బలం లేకుండానే అధికార పార్టీ నేత ఆలపాటి రాజా ఫ్లెక్సీని తొలగించేందుకు అధికారులు అత్యుత్సాహం చూపించడం ఏంటని మండిపడ్డారు. తెనాలిలో టీడీపీని చంపేయడమే లక్ష్యంగా మున్సిపల్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ వ్యవహరిస్తున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్‌ ఖుద్దూస్‌ ఆరోపించారు. డివైడర్‌ కు ఒకవైపు ఇదంతా జరుగుతుండగా మరోవైపు తొలగించిన ఫ్లెక్సీని కొందరు యువకులు తిరిగి ఏర్పాటుకు ప్రయత్నించారు. దీనిని నిరోధించటానికి పోలీసులు పూనుకోవటంతో తోపులాట జరిగింది. అయినప్పటికీ తొలగించిన ఫ్లెక్సీని టీడీపీ నాయకులు తిరిగి ఏర్పాటుచేశారు. రెండోవైపు తొలగించటానికి సాధ్యంకాక పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది మౌనంగా ఉండిపోయారు.

ఈ సమయంలోనే టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌పై ఆరోపణలను గుప్పించారు. తెనాలిలో టీడీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేయడమే లక్ష్యంగా మంత్రి మనోహర్‌ వ్యవహరిస్తున్నారని మహమ్మద్‌ ఖుద్దూస్‌ ఆరోపించారు. కూటమి పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తెనాలిలో పరిపాలన సాగుతుందని అన్నారు. ఎన్నికలవేళ జనసేన, టీడీపీ నాయకులను రెండు కళ్లుగా చూస్తానని చెప్పి గెలిచిన తర్వాత టీడీపీ నేతల ముఖం చూడడానికి కూడా మంత్రి మనోహర్‌ ఇష్టపడడం లేదని వారు దుయ్యబట్టారు. టీడీపీని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ఒక్క టీడీపీ కౌన్సిలర్‌ కూడా ఉండకూడదని మంత్రి నిర్దేశించుకున్నాడని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కౌన్సిలర్‌ త్రిమూర్తి ఆరోపించారు. ఇటువంటి చర్యలు పునరావృతం అయితే సహించేది లేదని టీడీపీ నాయకులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement