అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి
నరసరావుపేట: అధికారుల సమక్షంలో రెవెన్యూ సమస్యలు వెంటనే పరిష్కరించేందుకే రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో రెండోవారం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రెవెన్యూ క్లినిక్‌ను పరిశీలించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంచిన రెవెన్యూ దస్త్రాలు, వాటి పరిష్కార ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్‌లు గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి ఉండగా ఆయా డివిజన్ల వారీగా అర్జీలు స్వీకరించేందుకు టెంట్లు వేసి ఏర్పాటు చేశారు. వాటిలో ఆర్‌డీఓలు, తహసీల్దార్లు అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్ ప్రారంభం సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యామిలీ, పార్టిషన్, ప్రైవేటు వివాదాలు మినహా మిగతా సమస్యలు అన్నింటిని వెంటనే పరిష్కరిస్తారన్నారు. సర్వేకు సంబంధించిన వాటికి ఒక వారం సమయం పడుతుందన్నారు. కోర్టుకు సంబంధించినవి అయితే ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశామన్నారు. స్వయంగా తహసీల్దార్లనే ఇక్కడకు పిలిపించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. టోకెన్ల ప్రకారం అర్జీల పరిష్కారం చేస్తామన్నారు. రెవె న్యూ క్లినిక్‌కు వచ్చేవారందరూ తమ వద్దనున్న డాక్యుమెంట్లు మొత్తం తీసుకొని రావాల్సి ఉంటుందన్నారు. దీనిని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పింఛన్‌లు కావాలంటూ తన వద్దకు వచ్చిన దివ్యాంగుల సమస్య తెలుసుకొని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ, మూడు డివిజన్ల ఆర్‌డీఓలు పాల్గొన్నారు.


