విద్యార్థి అనుమానాస్పద మృతి
క్రోసూరు: మండలంలోని హసనాబాద్ గ్రామంలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుకునే విద్యార్థి షేక్ ముజావర్ ఖలీల్(11) దగ్గరలోని కొండప్రాంతంలో విగతజీవిగా పడి ఉండటంతో గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, సీఐ సురేష్, ఎస్‌ఐ పి.రవిబాబు, సిబ్బంది, డాగ్ స్క్వాడ్‌లతో దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాలు...హసనాబాద్‌కు చెందిన ముజావర్ బూరిసైదా గ్రామంలో విద్యుత్ పనులకు వెళ్తుంటాడు. ఆయన భార్య చాలా సంవత్సరాల కిందట మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు షేక్ ముజావర్ ఖలీల్(11) ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావటంతో మృతుడు(ఖలీల్) తన స్నేహితులు మరో ముగ్గురితో కలసి రేగుపండ్ల కోసుకునేందుకు కొండ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ కొంత సమయం ఉన్న తరువాత ఖలీల్ తాను తర్వాత వస్తా మీరు వెళ్లండని చెప్పడంతో స్నేహితులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఖలీల్ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. ఘర్షణ జరిగి కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమీపంలో చిన్నపాటి కత్తి దొరికింది. మృతదేహంపై రక్తపు మరకలున్నాయి. సమీపంలోని చిన్న నీటి కుంటలో మృతదేహం పడవేసి ఉంది. డ్కాగ్ స్క్వాడ్‌ను రప్పించి పరిశీలించారు. కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. విద్యార్థి మృతికి గల కారణాలు, హత్య జరిగి ఉంటే ఎవరు చేశారో దర్యాప్తు జరిపి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. బాలుడి మృతి వార్త తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.


