చిన్నారులకు సేవా దృక్పథం అలవాటు చేయాలి
ఆధునికీకరించిన రెడ్‌క్రాస్ భవనం, జనరిక్ షాపులను ప్రారంభించిన కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ప్రతి కాలేజీ, పాఠశాలల్లో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ స్థాపించి పిల్లలకు చిన్న వయసు నుంచే సేవా దృక్పథం అలవాటు చేయాలని జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ ప్రెసిడెంట్ కృతికా శుక్ల సూచించారు. సోమవారం స్టేషన్‌రోడ్డులో ఆధునికీకరించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లాశాఖ భవనం, జనరిక్ మెడికల్ షాపును కలెక్టర్ ప్రారంభించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ రెడ్‌క్రాస్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయొచ్చని చెప్పారు. తాను కాకినాడ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో కాకినాడ రెడ్‌క్రాస్‌లో తలసేమియా ట్రాన్స్‌ప్యూజన్ సెంటర్, కార్నియా కలెక్షన్ సెంటర్, జనరిక్ మెడికల్ షాప్, సీ్త్రలకు ఉపాధి కల్పన వంటి సేవలకుగానూ గవర్నర్ నుంచి రెండుసార్లు అవార్డు అందుకున్నట్లు చెప్పారు. రెడ్‌క్రాస్‌ను బలోపేతం చేయాలంటే దానికి లైఫ్ మెంబర్స్, జిల్లా ప్రజల మద్దతు, వారి సలహాలు, సూచనలు అవసరమని అన్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ యొక్క సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. అదే విధంగా సీఎస్‌ఆర్ ఫండ్స్ ద్వారా అవకాశం ఉన్నంత మేరకు సహకారం అందిస్తామని తెలియజేశారు. జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ ఎంఆర్ శేషగిరిరావు, ఆర్‌డీఓ కె.మధులత, వైస్ చైర్మన్ కేవీఎన్‌ఎస్ గుప్తా, ట్రెజరర్ డాక్టర్ నంద్యాల రామప్రసాదరెడ్డి, మేనేజింగ్ కమిటీ మెంబర్స్ డాక్టర్ కంజుల జగన్‌మోహన్‌రెడ్డి, డాక్టర్ రామ్‌ప్రసాద్, డాక్టర్ సృజన, బత్తుల మురళి పాల్గొన్నారు.


