అర్ధాకలితోనే విద్యాభ్యాసం
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు అల్పాహారానికి నిధులు ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం దాతలు, స్వచ్ఛంద సంస్థల సాయం కోసం ఎదురు చూపులు
సత్తెనపల్లి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పునశ్చరణ తరగతులు, ప్రత్యేక బోధన, అనుమానాల నివృత్తి కోసం ప్రతి పాఠశాలలో 100 రోజుల ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. అలాగే సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకూ ప్రత్యేక స్టడీ అవర్స్‌లో ఉంటున్నారు. దీనితో వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రత్యేక తరగతులు, చదువుతో అలసటకు గురవుతున్నారు. ఉదయం ఇంటి వద్ద అల్పాహారం చేసిన వీరికి పాఠశాలలో మధ్యాహ్న భోజనం తప్ప ఇతరత్రా ఎలాంటి ఆహారం అందకపోవడం వల్ల ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక తరగతులు ముగిసి ఇళ్లకు చేరడానికి రాత్రి 6.30 నుంచి 7.00 గంటలు అవుతుంది. దీనితో విద్యార్థులు నీరసించి పోతున్నారు.
అర్ధాకలితోనే ప్రత్యేక తరగతులకు..
గతంలో జిల్లా పరిషత్ వారు 10వ తరగతి విద్యార్థులకు కొన్నాళ్లు అల్పాహారం అందించింది. తర్వాత ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు గ్రామంలోని కొందరు దాతలు సహకారంతో ప్రతిరోజూ అల్పాహారాన్ని విద్యార్థులకు అందించే వారు. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులలో అల్పాహారం అందడం లేదు. ప్రత్యేక తరగతుల సమయంలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించేం దుకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయలేదు. అల్పాహారం కోసం ఒక్కో పాఠశాలకు రోజుకు సుమారు రూ.500 నుంచి రూ.1,500 వరకు ఖర్చవుతుందని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. విద్యార్థులకు అల్పాహారంగా పులిహోర, ఉప్మా, ఉడకబెట్టిన సెనగలు, అరటి పండ్లు, వేరుశనగ ఉండలు, సమోసాలు, బిస్కెట్లు అందజేయవచ్చు. జిల్లాలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఎందరో దాతలు నిత్యం పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం సమయంలో అల్పాహారం అందిస్తే వారు చదువుపై మరింత ప్రత్యేక దృష్టి సారించి మంచి ఫలితాలను సాధించే అవకాశం కలుగుతుంది.


