అర్జీలు సకాలంలో నాణ్యతతో పరిష్కరించండి
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పీజీఆర్‌ఎస్‌లో 154 అర్జీలు స్వీకరించిన కలెక్టర్, అధికారులు
నరసరావుపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిచే 154 అర్జీలు ఇతర జిల్లా అధికారులతో కలిసి స్వీకరించారు. ఎక్కువగా పింఛన్ల కోసం అర్జీదారులు కలెక్టరేట్ బాట పట్టారు. ఇప్పటికే రూ.6వేలు పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగులు తమకు రూ.15వేలు అందజేయాలని అర్జీలు ఇవ్వగా, వృద్ధాప్యం, విడో, అంగవైకల్యం, పక్షవాతం, క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు అర్జీలు అందజేశారు. నాదెండ్ల మండలం ఎండుగంపాలెంకు చెందిన 14ఏళ్ల గొట్టిపాటి మహీధర్ యాక్సిడెంట్‌లో నడుములు కోల్పోయిన పరిస్థితిలో తనకు పింఛన్ మంజూరు చేయాలంటూ తన నాయనమ్మతో కలిసి కలెక్టర్‌ను కలిశారు. కలెక్టర్ స్వయంగా కిందకు దిగి వచ్చి అతడి పరిస్థితి తెలుసుకొని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవిని పిలిచి అతడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. తన వద్ద పెండింగ్‌లో ఉందని, ప్రభుత్వం పింఛన్‌కు దరఖాస్తుకు ఆదేశాలు ఇవ్వగానే సమస్య పరిష్కరిస్తామన్నారు. కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలని, గ్రీవెన్స్‌పై ఆడిట్ నిర్వహించాలని సూచించారు. అర్జీదారులతో మాట్లాడి పెండింగ్ ఆడిట్ పూర్తిచేయాలని అన్నారు. డీఆర్‌ఓ ఏకా మురళి, ఆర్‌డీఓ కె.మధులత, అధికారులు పాల్గొన్నారు.
అర్జీలు సకాలంలో నాణ్యతతో పరిష్కరించండి


