ముగిసిన రోడ్డు ప్రమాద నిందితుల పోలీసు కస్టడీ
పోలీసు విచారణలో సంచలన విషయాలు
వందల సంఖ్యలో కార్ల చోరీ
పోలీసులు, రాజకీయ నేతలకు కానుకగా ఇచ్చిన నిందితులు
నాదెండ్ల: చిలకలూరిపేట నూతన బైపాస్ రోడ్డుపై ఈ నెల 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతికి కారణమైన నిందితులను పోలీసులు సోమవారం చిలకలూరిపేట న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగియటంతో ప్రధాన నిందితుడు మదమంచి వెంకట అనుజ్ఞనాయుడు (నరసరావుపేట), పుల్లంశెట్టి మహేష్ (నర్సింగపాడు), బెల్లంకొండ గోపీ (నకరికల్లు), షేక్ నబీబాషా (చినతురకపాలెం), నాలి వెంకటరావు(రుద్రవరం)లను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలలో వైద్యపరీక్షల అనంతరం చిలకలూరిపేట న్యాయస్థానంలో హాజరుపరిచారు. గడిచిన ఐదురోజుల్లో మొదటి మూడు రోజులు చిలకలూరిపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో, మరో రెండు రోజులు నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ హనుమంతరావు, సీఐ సుబ్బనాయుడు విచారించారు. పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నిందితులు వందల సంఖ్యలో కార్లను దొంగిలించి అమ్మినట్లు విచారణలో తేలింది. నిందితుల వద్ద కార్లు కొన్న వారిలో పోలీసు అధికారులు సైతం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 27 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన వెంకట అనుజ్ఞనాయుడు కార్ల దొంగతనాలతోపాటూ గంజాయి, రేషన్ మాఫియాలోను హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఉదంతంలో నిందితులకు సహకరించిన వారిలో పోలీసులు, రాజకీయ నాయకులు ఉన్నట్లు సమాచారం.


