తిరోగమనమే సర్కారు విధానం!
గురజాల: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి విధానాన్ని విస్మరించి తిరోగమన విధానాన్ని అవలంభించడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం నగర పంచాయతీలో విలీనం అయిన జంగమహేశ్వరపురంను తిరిగి విడగొట్టి గ్రామ పంచాయతీగా చేయడానికి సిద్ధ పడటంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి జంగమహేశ్వరపురం గ్రామాన్ని గురజాలలో విలీనం చేసి నగర పంచాయతీగా మార్చారు. గురజాలతో పాటు జంగమహేశ్వరపురంలో కూడా నిరుపేదలకు ఇంటి నివేశన స్థలాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణం చేపట్టేలా చర్యలు చేపట్టడం, ప్రతి ఇంటికి అమృత సర్ పథకం కింద మంచినీటిని అందించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు జంగమహేశ్వరపురంలో సీసీ రోడ్డులు, డ్రైనేజ్‌లు ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేపట్టారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జంగమహేశ్వరపురం గ్రామాన్ని గురజాల నగర పంచాయతీ నుంచి విడదీసి కేవలం గ్రామంగా ఉంచాలని కూటమి ప్రభుత్వం కుటిల యత్నాలు చేయడం సిగ్గుచేటని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతి ఏడాది రెండుమార్లు ఇంటి పన్నులు కట్టాలని ఉపాఽధి హామీ పనులు లేకుండా ఉన్నాయనే పనులు సాకు చూపుతూ జంగమహేశ్వరపురంను తిరిగి గ్రామ పంచాయతీగా చేయాలనే ఆలోచన చేయడం విడ్డూరంగా ఉందని పలువురు అంటున్నారు. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఇంటి పన్నులు తగ్గించే అవకాశం ఉంటుందని, లేకపోతే పూర్తిగా నిలుపుదల చేసే అవకాశం కూడా కూటమి ప్రభుత్వం చేతుల్లో వుంటుందని పలువురు అంటున్నారు. అందుకు భిన్నంగా నగర పంచాయతీ విలీనం నుంచి జంగమహేశ్వరపురంను విడదీసే వింత పోకడలు పోవడం ప్రజల ఆందోళనకు గురవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన నాటి నుంచి గురజాల ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించి అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుపడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో అభివృద్ధిలో దూసుకుపోయిన ఈ ప్రాంతాన్ని అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే వెనుకబడిన ప్రాంతంగా మార్చారని ప్రజలు ఆందోళన చెందుతుతున్నారు.
గురజాల నగర పంచాయతీ నుంచి
జంగ మహేశ్వరపురంను విడగొట్టనున్న చంద్రబాబు ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ హయాంలో గ్రామాన్ని రూ.22 కోట్లతో అభివృద్ధి
రాజకీయ కారణాలతో మళ్లీ గ్రామంగా మార్చేయత్నం


