
సుజలాం..సుఫలాం
ప్రత్యామ్నాయం ఆలోచిస్తే జలసవ్వడే!
వాగు నీరు సద్వినియోగ మార్గమేదీ?
ఏటా 12 వేల క్యూసెక్కులు వృథా
వర్షం రోజుల్లో పరవళ్లు, ఆపై నిరాశే
వర్షపు నీరు సద్వినియోగం కాక
యడ్లపాడు: చిలకలూరిపేట నియోజకవర్గంలోని పలు వాగులు వర్షానికి ప్రాణం పోసుకుని ఉప్పొంగి జీవ నదుల్లా ప్రవహిస్తుంటాయి. ఓగేరు, కుప్పగంజి, నక్కవాగు, వేదమంగళ వాగు ప్రధాన వాగులు కాగా, వాటి పాయలుగా ఉప్పవాగు, దంతెన వాగు, నల్లవాగు ఉన్నాయి. ఇవి కొద్దిపాటి వర్షాలు కురిసినా ఎగువ ప్రాంతాల నుంచే వచ్చే వాననీరు, సమీప పొలాల్లోని నీరంతా ఏకమై నిండుగా ప్రవహిస్తాయి. ఆరంభంలో పిల్ల కాలువల్లా కనిపించే ఈ వాగులు దిగువ ప్రాంతాలకు వచ్చేసరికి ఉధృతమై భారీ ప్రవాహంగా మారతాయి. ఆ జలాలు కనీసం సాగుకు ఉపయోగించుకునే అవకాశం లేక ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. ప్రతి వర్షాకాలంలోనూ నిండుగా కనిపించే వాగుల్లో ఏటా సుమారు 22 వేల క్యూసెక్కులు తమ కళ్లేదుటే వృథాగా సముద్రం పాలవుతుంటే గుండెలు తరుక్కుపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జల సంరక్షణపై దృష్టి సారించాలి...
ఈ వాగులకు ఇరువైపులా ఉన్న వేలాది ఎకరాలల్లో వివిధ పంటల్ని సాగు చేస్తున్నారు. ఒక వైపు వాగుల్లో వచ్చే వరద నీరు భారీస్థాయిలో సముద్రంలో కలిసిపోవడం, మరోవైపు సాగుకు చుక్క నీరందక ఎండిన పంటలను చూసి రైతులు తల్లడిల్లితుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే వాగులపై అక్కడక్కడా చెక్ డ్యామ్‌ల నిర్మాణమే చక్కని పరిష్కారమని అన్నదాతలు చెబుతున్నారు. అయితే చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి చట్టపరమైన, సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని..వాటివల్ల ప్రమాదాలు నెలకొంటాయని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. చెక్ డ్యామ్‌లు మాత్రమే కాకుండా, ఈ సమస్యకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రత్యామ్నాయాలు ఇలా చేసుకోవచ్చు...
చెక్ డ్యామ్‌ల నిర్మాణం సాధ్యం కాకున్నా, దాని కన్నా మెరుగైన ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి.
ప్రవహించే నీటి వనరులుగా కాకుండా, సాగు భూములకు ఉపయోగపడే జీవధారలుగా మార్చే ప్రణాళికలు చేయాలి. అందుకు విధిగా రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. వాగులకు అడ్డుకట్టలు వేయకుండా, ప్రవాహానికి అడ్డుపడని విధంగా..వాగులకు ఇరువైపులా ఉన్న పల్లపు ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెరువులు, కుంటలు తవ్వించాలి. వాగుల్లోని వర్షం, వరద నీటిని చిన్న కాలువల ద్వారా ఆయా చెరువులు, కుంటలకు మళ్లించి నిల్వ చేయాలి. వాగుల పక్కన, నీరు ఎక్కువగా చేరే ప్రాంతాల్లో ’రీచార్జ్ పిట్’ నిర్మాణాలను ఎక్కవగా చేపట్టాలి. అక్కడక్కడా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. వీటిద్వారా భూమిలోకి నీరు ఎక్కువగా ఇంకి, భూగర్భ జలాలు పెరుగుతాయి. వర్షాలు కురవని సమయంలో తిరిగి నీటిని పంట పొలాలకు ఉపయోగించుకోవచ్చు. ముందుగా వాగులకు పటిష్ట కరకట్టల్ని ఏర్పాటు చేసుకోవాలి. వర్షపు నీటి సంరక్షణ, సద్వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి. వాగుల్లోనూ కరకట్టలపై జంగిల్ క్లియరెన్స్, కాలువలను తవ్వడం, గండ్లను పూడ్చడం వంటి పనులను ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలి. ప్రభుత్వం కేవలం నిర్మాణాలు చేపట్టి వదిలేయకుండా, రైతులను, స్థానిక ప్రజలను భాగస్వాములను చేసి కమ్యూనిటీ ఆధారిత నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి.
అల్లాడుతున్న అన్నదాత

సుజలాం..సుఫలాం

సుజలాం..సుఫలాం