రెచ్చిపోతున్న కోళ్ల మాఫియా | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న కోళ్ల మాఫియా

Aug 24 2025 7:29 AM | Updated on Aug 24 2025 12:02 PM

రెచ్చిపోతున్న కోళ్ల మాఫియా

రెచ్చిపోతున్న కోళ్ల మాఫియా

రెచ్చిపోతున్న కోళ్ల మాఫియా

అధిక ధరలకు కోళ్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నేత రోజుకు 2,000 కోళ్లకు పైగా అమ్మకాలు ఒక్కొక్క కోడికి రూ 50 అదనంగా వసూలు ఇతరులు అమ్మితే పోలీసుల ద్వారా బెదిరింపులు టీడీపీ ముఖ్య నేత కోసం వ్యాపారులను బెదిరిస్తున్న పోలీసులు. గురజాల నియోజకవర్గంలో కొనసాగుతున్న విష సంస్కృతి

సాక్షి టాస్క్‌ ఫోర్స్‌: ఇప్పటి వరకు రేషన్‌ మాఫియా.. లిక్కర్‌ మాఫియా.. మట్టి మాఫియా...ఇసుక మాఫియాల గురించి విని ఉంటాం, కానీ గురజాల నియోజకవర్గంలో కొత్తగా కోళ్ల మాఫియా రంగంలోకి దిగింది. కోళ్ల మాఫియా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏడాదికి కోట్లు సంపాదించుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు ఈ అక్రమ వ్యాపారం ద్వారా ఏడాదికి రూ. మూడు కోట్లకు పైగా అక్రమంగా సంపాదిస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఒక్కొక్క కోడికి రూ.50 అదనంగా వసూలు

టీడీపీ ముఖ్యనేత కోళ్ల వ్యాపారం ద్వారా అక్రమ దందాలకు పాల్పడుతున్నాడు. మాఫియాను తలదన్నేలా ఈ నేత చేస్తున్న అక్రమ వ్యాపారం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. చికెన్‌ వ్యాపారంలో గతేడాదిగా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ అక్రమంగా ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. మార్కెట్లో కోడి ధర సుమారుగా రూ.90 ఉంటే టీడీపీ నేత అదే కోడిని రూ.140 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నాడు. అంటే ఒక్కొక్క కోడికి సగటున రూ.50 అదనంగా వసూలు చేస్తున్నాడు. టీడీపీ నేత రోజుకు 2,000 నుంచి 2,500 వరకు కోళ్లను విక్రయిస్తుంటాడు. అదే పండుగ రోజుల్లో అయితే 3వేల నుంచి 4 వేలకు పైగా కోళ్లను అమ్ముతూ ఉంటాడు. కోడికి రూ.50 అదనంగా వసూలు చేయడం వలన నెలకు సుమారుగా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నాడు. ఏడాదికి సుమారుగా రూ.మూడు కోట్లకు పైగా కోళ్ల అమ్మకాల ద్వారా ఆ నేత అక్రమార్జన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఒక దాచేపల్లిలోనే ఈ దందాను కొనసాగించిన ఆయన ఇప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని కోళ్ల దందాని నియోజకవర్గం మొత్తం విస్తరించేందుకు చర్యలు చేపట్టాడు. ఇతర వ్యాపారులను పోలీసుల ద్వారా బెదిరిస్తున్నట్లు సమాచారం.

పోలీసులతో బెదిరింపులు

టీడీపీ ముఖ్య నేత కనుసనల్లోనే పోలీసులు ఇక్కడ ఇతర వ్యాపారులపై బెదిరింపులకు దిగితున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇక్కడ కోళ్ల వ్యాపారం చేసుకుని చికెన్‌ విక్రయించుకునే వ్యాపారులంతా ఒక్కసారిగా కనుమరుగయ్యారు. టీడీపీ ముఖ్య నేత పోలీసుల ద్వారా చికెన్‌, కోళ్ల వ్యాపారం చేసే వ్యాపారులను బెదిరించి ఇక్కడ వ్యాపారాలు చేస్తే కేసులు పెడతామని బెదిరించారు. అంతేకాకుండా ఇక్కడ టీడీపీ నాయకుడికి వ్యతిరేకంగా మీరు వ్యాపారాలు చేస్తే మీపై గంజాయి కేసులు పెడతామని కూడా బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇక్కడ వ్యాపారం చేసేందుకు ఇతరులు భయపడుతున్నారు. టీడీపీ ముఖ్యనేత అదే పార్టీకి చెందిన వ్యాపారులను ఇటీవల బెదిరించటం ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. సొంతం పార్టీ వ్యాపారులనే బెదిరించడంతో తిరుగుబాటు చేసేందుకు సిద్ధం కావడంతో సర్ది చెప్పారు. కోళ్ల వ్యాపారం చేసే టీడీపీ ముఖ్యనేత వ్యవహారంపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు రావటం ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. కోళ్ల వ్యాపారానికి సంబంధించి సదరు టీడీపీ నాయకుడు సత్తెనపల్లి, నరసరావుపేటలో కూడా తన దందాను సాగించినట్లు తెలుస్తోంది. అక్కడ కూడా అధికారం అడ్డు పెట్టుకొని స్థానిక వ్యాపారులను బెదిరింపులకు గురి చేసినట్లు కూడా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement