
పిచ్చికుక్క స్వైర విహారం
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణంలోని 26వ వార్డులో ఉన్న సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూలు వెనుక వైపు బజారులో పిచ్చికుక్క శనివారం స్వైర విహారం చేసింది. ఉదయం నుంచి తొమ్మిది మందిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపర్చింది. దాడిలో గోపాలం, ఉల్లిగడ్డలు అమ్ముకునే నాగేశ్వరరావు, చిల్లర దుకాణం నిర్వాహకురాలు సుధారాణి, గృహిణి వెన్ను వెంకటరమణ తదితరులు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో పలు పాఠశాలలు ఉన్నాయి. నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు స్కూలు వద్దకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రాంతంలో కుక్కల బెడద ఉందని గతంలో ఎన్నోమార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
పట్టించుకోని వైద్య సిబ్బంది
కుక్కల దాడిలో గాయపడిన వారు అన్న క్యాంటీన్ పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వెళ్లారు. వైద్య సిబ్బంది కుక్క కరిసిన ప్రాంతంలో క్లీనింగ్ కూడా చేయకుండా మేము ఏమీ చేయలేమని దురుసుగా ప్రవర్తించారు. వైద్య సిబ్బందే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.
తొమ్మిది మందికి గాయాలు