
టంగుటూరి జీవితం భావితరాలకు ఆదర్శం
నరసరావుపేట: ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం భావితరాలకు ఆదర్శమని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో టంగుటూరి జయంతి వేడుకల సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్, అధికారులు నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ పేదరికంలో పుట్టి, పూట కూళ్లలో పనిచేస్తూ ఉన్నత విద్యావంతునిగా, పత్రికా సంపాదకునిగా, ప్రజా నాయకునిగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, ముఖ్యమంత్రిగా ఎదిగి, సంపాదించిన దానిని ప్రజలకే పంచి, పేదవానిగా మృతిచెందిన మహానీయుడని పేర్కొన్నారు. సైమన్ గో బ్యాక్ నినాదంతో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి గుండె చూపిన ధైర్యశాలిగా పేర్కొన్నారు. రైతుల కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టారని, వాటి ఫలాలను రైతులు నేడు అనుభవిస్తున్నారని తెలిపారు. యువతకు వారు చూపిన మార్గం ఆదర్శమని పేర్కొన్నారు. డీఆర్‌ఓ ఏకా మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నరసరావుపేటరూరల్: ఇస్సపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి పట్టణానికి చెందిన పూనూరి కోటిరెడ్డి, రమాదేవి దంపతులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు. ఆలయంలో శనివారం ఈవో నలబోతు మాధవిదేవిని కలిసి విరాళం చెక్కు దాతలు అందజేశారు. పూనూరి కోటిరెడ్డి దంపతుల కుమారుడు వేణుగోపాలరెడ్డి, కుమర్తె ప్రియాంక, పూదోట కిరణ్, ఆలయ అర్చకులు కొత్తలంక కార్తికేయశర్మ, నండూరి కాళీకృష్ణలు పాల్గొన్నారు.
తాడికొండ: రాజధానిలో పనిచేసే కాంట్రాక్టు సంస్థలు నిబంధనలు పాటిస్తూ కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ సూచించారు. శనివారం తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌లో రాజధాని నిర్మాణంలో పాలు పంచుకునే వివిధ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అందరూ హాజరు కాకుండా అరకొరగా సమావేశానికి రావడంపై ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో కార్మికులు ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. సీఐలు శ్రీనివాసరావు, అంజయ్య ఎస్‌ఐలు పాల్గొన్నారు.
గుంటూరు వెస్ట్: ఈ ఏడాది వినాయక చవితి పండుగ సందర్భంగా అందరూ మట్టితో చేసి, సహజ రంగులు వాడే గణనాథుని విగ్రహాలను ప్రతిష్టించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన అవగాహన పోస్టర్‌ను కలెక్టర్‌తోపాటు డీఆర్వో షేక్ ఖాజావలి, పర్యావరణ ఇంజినీర్ ఎండీ నజీమా బేగం, సీపీఓ శేషశ్రీ శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే కొన్ని నిబంధనలు పాటించాలన్నారు. మట్టి వినాయకుడిని పూజించి అందరూ బాధ్యతను చాటుకోవాలన్నారు.

టంగుటూరి జీవితం భావితరాలకు ఆదర్శం

టంగుటూరి జీవితం భావితరాలకు ఆదర్శం

టంగుటూరి జీవితం భావితరాలకు ఆదర్శం