
నమో ఏక దంతాయ!
వినాయక చవితి ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు వాడవాడలా సిద్ధమవుతున్న చలువ పందిళ్లు వినాయక ఉత్సవ నిర్వహణలో నిబంధనలు తప్పనిసరి గణేష్ ఉత్సవ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బందులు తప్పవు
సత్తెనపల్లి: జిల్లాలో వినాయక చవితి సందడి నెలకొంది. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరునికి తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ప్రజల సిద్ధమవుతున్నారు. గణపతి నవరాత్రుల ఉత్సవాలకు గ్రామాల్లో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 27న వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఆలయాల వద్ద చలువ పందిళ్లు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవ కమిటీలు పాటించాల్సిన నిబంధనలు ఇలా ఉన్నాయి..
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు...
గణేష్ మండపాల అనుమతులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
https://ganeshutsav.net సైట్ లో ఎంటర్ అవ్వగానే న్యూ అప్లికేషన్ క్లిక్ చేసి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయ్యాక దరఖాస్తు విండో ఓపెన్ అవుతుంది. దరఖాస్తు ఫారంలో దరఖాస్తుదారుని పేరు, మొబైల్ నెంబరు, ఈ–మెయిల్ అడ్రస్, చిరునామా, అసోసియేషన్/కమిటీ పేరు నమోదు చేయాలి. గణేష్ మండపం స్థలం, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, ఏ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. గణేష్ నిమజ్జనం చేసే తేదీ, సమయం, వాహనం, డ్రైవర్ వివరాలు నమోదు చేసిన అనంతరం పోలీసులు మండపాన్ని పరిశీలించి, అనుమతులు మంజూరు చేస్తారు.